ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024లో జరుగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పధకాలపేరుతో ఓటర్లకు అధికారికంగా లక్షలకోట్లు పంచుతోంది. దీనికోసం జగన్ సర్కార్ లక్షల కోట్లు అప్పులు తెస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఆ ఆర్ధికభారాన్ని లబ్ధిదారులతో సహా రాష్ట్ర ప్రజలందరిపైనే పడుతోంది.
ఇక వైసీపి రాజకీయ అవసరాల కోసం సృష్టించిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థల కోసం వేలకోట్లు ఖర్చుచేస్తోంది. సంక్షేమ పధకాల ప్రచారానికి వేలకోట్లు ఖర్చు చేస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు ఉండదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు డబ్బు ఉండదు. కానీ టిడిపిని రాజకీయంగా దెబ్బతీసేందుకు పోలీస్ కేసులు నమోదు చేసి, వాటిపై న్యాయపోరాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేస్తోంది.
అమరావతితో సహా జగన్ సర్కార్ తీసుకొన్న అనేక వివాదాస్పద నిర్ణయాలపై హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటాలు చేస్తూనే ఉంది. వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇవన్నీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ, ఆర్ధిక వ్యవహారాలలో దూరదృష్టి లేదని నిరూపిస్తున్నాయి.
అయితే ప్రభుత్వోద్యోగులకు పాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ (ఓపిఎస్)విధానం అమలుచేస్తే, 2030 నాటికి రాష్ట్ర ఆర్ధికలోటు 4.8శాతం, 2040కి 6.1 శాతం,2050కి 8శాతం, 2100కి ఏకంగా 40శాతానికి చేరుకొని రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ కుప్పకూలిపోతుందని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న శాసనసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 2070 వరకు ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ని రూపొందించామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
వైసీపి ప్రభుత్వానికి ఇంత దూరదృష్టి ఉంటే, పైన చెప్పుకొన్నవాటన్నిటి కోసం లక్షల కోట్లు అప్పులు చేయకూడదు కదా?కానీ నేటికీ ఎడాపెడా అప్పులు చేస్తూనే ఉండి కదా?ఓ వైపు అందినకాడికి అప్పులు చేస్తూనే ఓపిఎస్ అమలుచేస్తే ‘భవిష్యత్‌లో అప్పు పుట్టదని’ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. అంటే ప్రభుత్వం ఐటి, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ తదితర రంగాలను అభివృద్ధి చేసి ఆర్ధికాభివృద్ధి సాధించే ఆలోచన చేయకుండా ఎప్పటికీ ఇలాగే అప్పులు చేస్తూనే ఉండిపోవాలా?
అయినా 2024 ఎన్నికలలో మళ్ళీ గెలుస్తామో లేదో తెలీని పరిస్థితిలో ఉన్న వైసీపి 2040,2070లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉంది. వైసీపి ప్రభుత్వానికి రాష్ట్ర భవిష్యత్ గురించి నిజంగా అంత ఆలోచన, ఆందోళన ఉండి ఉంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఉండకూడదు కదా?
ఓపిఎస్ విధానం వలన ఇంత ఆర్ధికభారం పడుతుందని తెలిసి ఉన్నప్పుడు మరి వైసీపి అధికారంలోకి రాగానే ఓపిఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వోద్యోగులకు ఎందుకు మాట ఇచ్చారు?ఆ మాట నిలుపుకోలేక తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్, ఆర్ధికలోటు అంటూ మంత్రి బుగ్గన ఈ కాకి లెక్కలు చెపుతున్నారు కదా?



