జూన్ 4న ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోబోతోందని జగన్ ఎందుకన్నారో కానీ అది నిజమేనని ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటిసారే 151/23 సీట్ల భారీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రెండోసారి దారుణంగా ఓడిపోబోతున్నారని ఎన్నికల ఫలితాలు సూచిస్తుంటే దేశ ప్రజలు ఆశ్చర్యపోకుండా ఉంటారా? జగన్ తన ఓటమిని కూడా ఇంత దూరదృష్టితో చూసి చెప్పడం చాలా గొప్ప విషయమే కదా?
ఈ ఎన్నికలలో పెత్తందారులకు, పేద ప్రజలకు మద్య పోటీ అని జగన్ చెప్పుకున్నారు. నా సంక్షేమ పధకాలతో మీకు మేలు జరిగిందని భావిస్తే నా మొహం చూసి ఓట్లు వేయండని నొక్కి చెప్పారు. అంటే ఈ ఎన్నికలను 5 ఏళ్ళ తన పాలనకు రిఫరెండంగా భావించి ఓట్లు వేయమని కొరిన్నట్లు భావించవచ్చు.
మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రాక్షసపాలన నుంచి విముక్తి కోసం, అమరావతి కోసం, అభివృద్ధి కోసం తమ కూటమికి ఓట్లు వేయండని ప్రజలను అడిగారు.
అంటే సంక్షేమ పధకాలు కావాలా? అభివృద్ధి కావాలా?అనే రెండు భిన్నమైన విధానాలతో వారు ప్రజలను ఓట్లు అడిగిన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే జగన్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని అర్దమవుతోంది.
ఇక కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు మొదలవగానే సాక్షి స్టూడియోలో కూర్చోన్న వైసీపి రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికలలో వైసీపి ఎందువల్ల గెలవబోతోందో చెప్పగా, సాక్షి మీడియా వైసీపి గెలుస్తున్నట్లు చూపించింది. కానీ రెండు గంటలు గడిచేసరికి అదే సాక్షి మీడియాలో టిడిపి: 93, జనసేన:8, బీజేపీ: 4 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా వైసీపి 25 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉందనే వాస్తవాన్ని చూపించక తప్పలేదు.
కానీ వాస్తవానికి టిడిపి: 124, జనసేన: 19, బీజేపీ: 5 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా వైసీపి కేవలం 22 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఆధిక్యతలు స్పష్టం చేస్తున్నాయి. కనుక చివరి వరకు ఇలాగే కొనసాగవచ్చు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో కూడా టిడిపి: 14, జనసేన: 2, బీజేపీ: 4, వైసీపి: 5 సీట్ల అధిక్యతలో కొనసాగుతున్నాయి.
తాజా గణాంకాల ప్రకారం టిడిపి, జనసేన, బీజేపీల కూటమి: 148 స్థానాలలో ఆధిక్యంలో సాగుతుండటంతో జగన్ చెప్పిన్నట్లు దేశప్రజలు మాత్రమే కాదు వైసీపి నేతలందరూ కూడా ఈ ఫలితాలు చూసి తప్పక షాక్ అవుతారనే భావించవచ్చు.




