వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో గత 5 ఏళ్ళలో రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. ఎవరైనా మరిచిపోతే నేటికీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఉదాహరణకు భూమన కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్లలో రూ.2,000 కోట్ల అవినీతి గురించి మాట్లాడిన మాటలు అందరూ వినే ఉంటారు.
విని ఉండకపోతే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మహానందరెడ్డి ప్రెస్‌మీట్ విన్నా సరిపోతుంది. భూమన తిరుపతి రోడ్ల నిర్మాణంలో రూ.2,000 కోట్ల అవినీతి కబుర్లు చెపితే, మహానందరెడ్డి వైసీపీలో హత్యా రాజకీయాల గురించి మాట్లాడారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి, సోదరులు తనని హత్య చేస్తామని బెదిరిస్తున్నారని మహదానంద రెడ్డి చెప్పారు. తాను వైసీపీలో ఉండగానే హత్య చేయించాలని ప్రకాష్ రెడ్డి ప్రయత్నించారని కానీ అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తున్నారని మహానందరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు.
అమెరికాలో ఉంటున్న తన అన్న కుమారుడికి ప్రకాష్ రెడ్డి మనుషులు ఫోన్లు చేసి మీ బాబాయ్‌ని త్వరలో లేపెస్తాం,’ అని హెచ్చరించారని మహదానంద రెడ్డి చెప్పారు.
టీడీపి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రెడ్డి ద్వారా తనని అరెస్ట్ చేయించి హత్య చేయించాలని ప్రకాష్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని తనకు సమాచారం ఉందని మహదానంద రెడ్డి చెప్పారు.
తన అన్న ప్రసాదరెడ్డిని హత్య చేసిన హంతకులు నేటికీ ప్రకాష్ రెడ్డితోనే ఉన్నారని, కానీ పోలీసులు వారిని అరెస్ట్ చేయడంలేదని మహదానంద రెడ్డి అన్నారు. ఒకవేళ తనకు ఏదైనా జరిగితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాప్తాడు మాజీ ఎమ్మెల్యేతోపుదర్తి ప్రకాష్ రెడ్డి, సోదరులే కారణమని ప్రజలు, పోలీసులు గ్రహించాలని మహదానంద రెడ్డి అన్నారు.
వైసీపీ నేతలు పార్టీలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా మీడియా సమావేశాల్లో ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే అవి విని సామాన్య ప్రజలు షాక్ అవుతారు.
మీడియా సమావేశాలలోనే ఇంత అవినీతి, హత్యా రాజకీయాల గురించి చెపుతుంటే, వారు అంతర్గతంగా మాట్లాడుకునే మాటలు మరెంత భయంకరంగా ఉంటాయో? అనిపించక మానదు కదా?





