రిటైర్మెంట్ వయసు పెంపు… వరమా… డబ్బులేకనా?

YS Jaganఒకప్పుడు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు 58 ఏళ్ళకు రిటైర్ అయ్యేవారు. అప్పటికి ఇంకా కుటుంబ బాధ్యతలు తీరవు కనుక మరో రెండేళ్ళు పెంచాలని కోరుకొనేవారు. వారి అభ్యర్ధనల మేరకు ప్రభుత్వాలు రిటైర్మెంట్ వయసును 60కి పెంచాయి. అయితే అంత వయసు మీదపడిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు కూడా మీద పడతాయి కనుక మునుపటిలా చురుకుగా విధులు నిర్వహించడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తదితరులకు 60 ఏళ్ల తర్వాత పనిచేయడం కష్టంగానే ఉంటుంది. కనుక పదవీ విరమణ చేయాలనే కోరుకొంటారు.

అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అందరికీ 62 ఏళ్ళకి పెంచేసింది. అందుకు కారణం వారిమీద ప్రేమతో అని చెప్తుండవచ్చు. కానీ సంక్షేమ పధకాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తలకు మించిన భారం ఎత్తుకోవడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తలక్రిందులైనందునే. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించలేక, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించలేక, అభివృద్ధి పనులు చేపట్టలేక ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తుంటే వారందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆ తర్వాత నెలనెలా పింఛనులు కూడా చెల్లించడం చాలా కష్టం. కనుక ఈ సమస్యను రెండేళ్ళు వాయిదా వేసుకొనేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ వయసును మరో రెండేళ్ళు పెంచింది. కానీ అది వారికి వరమన్నట్లు వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటుంది. అది వేరే విషయం.

ADVERTISEMENT

నాటికీ నేటికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇంకా దిగజారుతూనే ఉన్నాయి తప్ప మెరుగుపడటం లేదు. కనుక ఇప్పుడు రాష్ట్ర దేవాదాయశాఖ ఉద్యోగులకు కూడా 60 నుంచి 62 ఏళ్ళకు, అలాగే యూనివర్సీటీల్లో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచేందుకు ఈరోజు మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపింది. అర్చకులకు అసలు రిటైర్మెంట్ లేకుండా చట్టసవరణ చేసేందుకు కూడా నిర్ణయించింది!

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్న తమ ప్రభుత్వానికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా 5 ఏళ్ళకోసారి తప్పనిసరిగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పదవీకాలం పొడిగించుకొనే వెసులుబాటు ఉంటే ఎంత బాగుండేది?అని బహుశః మంత్రులకూ అనిపించే ఉంటుందేమో?అందుకే కేసీఆర్‌ కొత్తగా రాజ్యాంగం వ్రాయలంటున్నారు. అర్దం చేసుకోరూ!

ADVERTISEMENT
Latest Stories