ఎన్నాళ్ళు ఈ “శవ రాజకీయాలు” జగన్?

YSRCP Jagan Mohan Reddy Politicsఓ పక్కన ఇల్లు తగలబడి పోతుంటే… మరో పక్కన తన పేలాలు వేగలేదన్నాడంట… వైసీపీ అధినేత జగన్ లాంటి వ్యక్తి. కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం, ముళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి భౌతిక కాయాలను నందిగామ ఆసుప‌త్రికి తరలించగా, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ ప‌రామ‌ర్శించ‌కుండానే మృత‌దేహాల‌ను త‌ర‌లిస్తున్నార‌ని వైసీపీ నేతలు ఆందోళ‌న‌కు దిగడం విశేషం.

ముందుగా ప్ర‌మాద స్థ‌లికి చేరుకుని అక్క‌డి ప‌రిస్థితిని ప‌రిశీలించిన జగన్, అనంత‌రం మృతుల కుటుంబాలను ప‌రామ‌ర్శించ‌డానికి ఆసుప‌త్రికి చేరుకున్నారు. అయితే, అప్ప‌టికే మృత‌దేహాల‌ను ఆసుప‌త్రి నుంచి సిబ్బంది తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో వైసీపీ నేత‌లు సిబ్బందిని అడ్డుకుని ఆందోళ‌న‌కు దిగడంతో, ఆసుప‌త్రి వ‌ద్ద హైడ్రామా నడిచింది. తమ పట్ల ప్ర‌భుత్వం అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వైసీపీ నేత పార్ధసారధి ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు.

ADVERTISEMENT

ఆ తర్వాత ఎట్టకేలకు జగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి, కలెక్టర్ ను అడిగి సహాయక చర్యలపై వివరాలు తెలుసుకుంటున్నారు. అనంతరం బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్ వద్ద నుంచి లాక్కున్న జగన్, తిరిగి ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకోవడం విశేషం. వైద్యులు ఎంతసేపు బ‌తిమిలాడినా ఆ రిపోర్డును ఇవ్వ‌కుండా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీంతో జోక్యం చేసుకున్న క‌లెక్ట‌ర్ ఎ.బాబు ఆ రిపోర్టును ఇచ్చేయాల‌ని కోరారు. ఈ సమయంలో కలెక్టర్‌ పై కూడా జగన్ నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత చేతిలో ఉన్న రిపోర్టుని కలెక్టర్ ఎ.బాబు తిరిగి తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంతో చెయ్ తీయ్ అంటూ క‌సురుకున్నారు. క‌లెక్ట‌ర్‌ ను సెంట్రల్‌ జైలుకు పంపిస్తానని, పోలీసులు, క‌లెక్ట‌ర్ స‌హా అంద‌రూ అవినీతి ప‌రులేన‌ని జ‌గ‌న్ ఆరోపించారు. శ‌వ‌ ప‌రీక్ష నివేదిక‌ను ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే నిర్వ‌హించామ‌ని జ‌గ‌న్‌ కు క‌లెక్ట‌ర్ చెప్పినప్పటికీ, ఇంత రాద్ధాంతం చేసారు.

ఓ పక్కన తమ కుటుంబ సభ్యులు పోయారని ఆందోళన చెందుతుంటే, పరామర్శల కోసం శవాలను తరలించకుండా అడ్డుకోవడం బహుశా వైసీపీ నేతలకు మాత్రమే చెల్లుబాటు అవుతుందేమో! నాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినపుడు కూడా జగన్ పై “శవ రాజకీయాలు” ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్ళు గడిచినా, జగన్ “శవ రాజకీయాలు” మాత్రం ఆపలేదని చెప్పడానికి తాజా ఉదంతమే నిదర్శనగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories