వచ్చే ఎన్నికలలో ఏపీలోని 175 సీట్లు మేమే గెలుచుకొంటామని వైసీపీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి కొత్త పాట అందుకోగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా కోరస్ పాడుతుండటం రోజూ వింటూనే ఉన్నాము. “మొత్తం అన్ని సీట్లు మేమే గెలుచుకోబోతున్నామని అంత గట్టి నమ్మకమున్నప్పుడు ఇంకా మా మీద పడి ఏడ్వడం ఎందుకు?” అని టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు ప్రశ్నకు సమాధానం లభించడం లేదు.
వైసీపీకి 175 సీట్లు వచ్చేస్తున్నప్పుడు, టిడిపి జనసేనలు పొత్తులు పెట్టుకొంటాయా, టిడిపితో బిజెపి మళ్ళీ దోస్తీ చేస్తుందా? మూడు కలిసి పోటీ చేస్తాయా?అని వైసీపీ ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ ఇదే విషయం ప్రస్తావిస్తూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తూనే ఉంటారు.
మాజీ బూతుల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడలో 10వ వార్డులో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఎన్టీఆర్, చిరంజీవిల పేర్లు చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్ళగలరా? వెళ్తే బండి సున్నాయే. పవన్ కళ్యాణ్‌కు బొత్తిగా రాజకీయ పరిజ్ఞానం లేదు. ఒక్కశాతం ఓట్లు కూడా లేని ఆయన చంద్రబాబు నాయుడుతో వెళ్ళినా, బిజెపిని కూడా కలుపుకు వచ్చినా 60 శాతం ఓట్లున్న సిఎం జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయగలరు?వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి, జనసేనలు కనబడకుండా మాయం అయిపోవడం ఖాయం,” అని అన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా తమ వ్యవస్థాపకుడు లేదా అధినేత పేరుతోనే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళతాయి. అందుకు వైసీపీ కూడా అతీతం కాదు. “నా ఫోటో ఒక్కటే చాలు మీ అందరినీ గెలిపించడానికి…” అని వారి అధినేత స్వయంగా చెప్పుకొంటారు. అలాగే కొడాలినాని కూడా “ప్రజలు జగన్ మొహం చూసే తమకు ఓట్లు వేస్తారు తప్ప మమ్మల్ని చూసి కాదని,” స్వయంగా చెప్పుకొన్నారు. మరి అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల గురించి ఈవిదంగా మాట్లాడటం దేనికి?
అంటే 175 సీట్లు గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ మూడు పార్టీలు కలిస్తే వైసీపీ కొట్టుకుపోతుందనే భయం, అభద్రతాభావమే. వైసీపీలో ఈ అభద్రతాభావం దాని అధినేత నుంచి కిందస్థాయి వరకు అందరిలోను ఉంది. అందుకే వారు రోజూ దేవుడిని తలుచుకోకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను రోజుకి ఓ పదిసార్లయినా తలుచుకొంటూ తమ వీపులు తామే తట్టుకొని ధైర్యం చెప్పుకొంటుంటారు.



