ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలంటే ఎంతో కష్టం. ఓ గ్రామంలో పాఠశాల కట్టించిందంటే ఆ ఊర్లో పిల్లలు అందరూ విద్యావంతులవుతారు. కానీ నంద్యాల జిల్లా పాణ్యం పట్టణంలోని ఇందిరా నగర్‌లో కట్టిన ప్రభుత్వ పాఠశాల మాత్రం తన కోసమే కట్టారనుకొన్నారు ఓ వైసీపీ నేత.
రాజీవ్ విద్యా మిషన్ కింద 2013లో రూ.5.30 లక్షలతో కట్టిన పాఠశాల కొంతకాలం బాగానే నడిచింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే వంకతో దానిలో విద్యార్థులను సమీపంలోని పాఠశాలలో విలీనం చేశారు. దీంతో 5 ఏళ్ల క్రితం పాఠశాల పూర్తిగా మూతపడింది. దానిని విద్యాశాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానిక వైసీపీ నేత ఆ పాఠశాలను స్వాధీనం చేసుకొన్నాడు.
ముందు పాఠశాల రూపురేఖలు కనబడకుండా మార్చేశాడు. తర్వాత గోడలు, మెడపైకి మెట్లు, వంటగది, బెడ్ రూములు, టాయిలెట్స్ అన్నీ కట్టుకొన్నాడు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సదరు వైసీపీ నేత గృహాప్రవేశానికి సిద్దమైపోయాడు.
అప్పుడు స్థానిక టిడిపి నాయకురాలు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తేగాని ఎంఈవో మేల్కొలేదు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పాఠశాలలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టారో తెలీదు. విచారణ జరుపుతున్నాం. పాఠశాలను స్వాధీనం చేసుకొని తాళాలు వేయించాము,” అని చెప్పారు.
దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందిస్తూ, “ఇదిగిదిగో… వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు..నేడు కార్యక్రమం… అంటూ వైసీపీ నేత ఇల్లుగా మార్చుకొన్న ఆ పాఠశాల ఫోటో ట్వీట్ చేశారు. “విద్యార్థులు లేకపోతే వారిని బడికి రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి కానీ వైసీపీ నేతల కబ్జాలు చేసుకోమని వదిలేయడం ఏమనుకోవాలి?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ఇటీవల రాష్ట్రంలో చాలా పాఠశాలలను ఇదే కారణంతో సమీపంలోని పాఠశాలలో ప్రభుత్వం విలీనం చేసింది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు చాలానే ఉన్నాయి. వాటన్నిటి పరిస్థితి ఏమిటో?