నేడు వైసీపీ 16 వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్ తో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే ‘నాడు’ జగన్ ఓదార్పు యాత్రతో మొదలైన వైసీపీ రాజకీయ ప్రయాణం ‘నేడు’ అనేక దశలను దాటుకుని ఇప్పుడు రప్ప రప్ప నినాదాలతో సాగుతుంది.
అలాగే ‘నాడు’ పార్టీ ఆవిర్భావంలో జగన్ తో పాటు కలిసి నడిచిన ముఖ్య నేతలెవ్వరు ‘నేడు’ జగన్ వెంటలేకపోవడం ఇక్కడ చర్చనీయాంశం. ముందుగా నాడు వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉండే జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి నేడు ఆ హోదాలోనే కాదు ఆ పార్టీలో కూడా లేరు.
అలాగే నాడు అన్న వదిలిన బాణంలా 2019 వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన జగన్ సోదరి వైఎస్ షర్మిల నేడు వైసీపీ పతనం కోసం పోరాడుతున్నారు. తండ్రి లేని బిడ్డ ఒక్క అవకాశం అంటూ తల్లి విజయలక్ష్మి ఒకపక్క, బై బై బాబు అంటూ చెల్లి షర్మిల మరోపక్క వైసీపీ గెలుపు కోసం, జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రచారాలు సాగించారు. తీరా ఫలితం వచ్చాకా తల్లి, చెల్లి ఇద్దరు కూడా వైసీపీ కి బై బై చెప్పాల్సి వచ్చింది.
ఇక నాడు వైసీపీ లో నెంబర్ 2 గా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ వెన్నుముక గా ఉండే విజయసాయి రెడ్డి కూడా నేడు జగన్ కోటరీ రాజకీయానికి తలవంచి వైసీపీకి దూరమయ్యారు. 2019 వైసీపీ గెలుపు కోసం ఢిల్లీ కేంద్రంగా తెరవెనుక చక్రం తిప్పిన సాయి నేడు వైసీపీ తెరచాటు రాజకీయానికి బలయ్యి రాజకీయాలకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు.
ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈయనకు వైసీపీ కి కేవలం పార్టీ పరమైన బంధమే కాదు అంతకు మించి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. అలాగే నాడు 2011 లో వైసీపీ ఆవిర్భావం నాటి నుంచి కూడా బాలినేని కాంగ్రెస్ ను కాదని జగన్ కు అండగా నిలబడ్డారు.
కానీ నేడు 2024 ఎన్నికల ఫలితాల తరువాత బాలినేని వైసీపీ కి దూరమయ్యి జగన్ కు భద్ర విరోధి అయిన పవన్ పంచన చేరారు. ఇలా ‘నాడు’ వీరంతా కూడా మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెట్టే జగన్ సైనికులం అంటూ సగర్వంగా “కాలర్” ఎగరేసుకున్నవారే. కానీ ‘నేడు’ వీరంతా అదే జగన్ రాజకీయం ముందు నిలబడలేక, వైసీపీ లో ఇమడలేక తలవంచుకుని పార్టీని వీడారు.




