జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కొందరు మంత్రులను పక్కన పెట్టినప్పుడు వారందరూ ‘అసమర్ధులు’ అని ముద్రవేసిన్నట్లయింది. మళ్ళీ ఇప్పుడు ఒకటోస్సారి… రెండోస్సారి… అంటూ జాబితాలు విడుదల చేస్తూ వాటిలో మంత్రులు, ఎమ్మెల్యేలను పక్కనపెడుతూ వారు కూడా ‘అసమర్దులే’ అని తేల్చిపడేశారు. ఆ జాబితాలో అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు.
మంత్రిగా ఉన్న తనకు ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా అర్హత లేదని జగన్ చెప్పేయడం ఆయనకు చాలా పెద్ద షాకే. ఈవిదంగా చేస్తారని తెలియక మంత్రి గుడివాడ ఇంతకాలం జగన్ భజన చేసుకొంటూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని విమర్శిస్తూ, కోడి, గుడ్డు కధలు చెప్పుకొంటూ కాలక్షేపం చేసేశారు.
వైసీపిలో ఇలాంటివారు చాలా మందే ఉన్నారు. వారందరూ నిన్న మొన్నటి వరకు “మా నమ్మకం నువ్వే జగన్… మా భవిష్యత్ నువ్వే జగన్…” అని భజన చేసినవారే. ఇప్పుడు ఎన్నికల గంట మ్రోగే ముందు తమపై నమ్మకం లేదని జగన్ చెప్పేస్తే, “మా భవిష్యత్ ఏమిటి జగన్?” అని వారు ప్రశ్నించే పరిస్థితి దాపురించింది.
వైసీపిలో ఉన్నా ఇక ప్రయోజనం లేదని తేలిపోయింది. పైగా అధినేత జగన్ స్వయంగా పొగపెడుతున్నారు కూడా. కనుక బయటకు పోక తప్పదు. కానీ వైసీపిలో పనిచేయడం అంటే ‘పులి మీద సవారీ’ వంటిదే అని ఇప్పుడిప్పుడే వారికి అర్దమవుతోంది.
“పార్టీలో పడి ఉన్నంతవరకే మర్యాద… ఒక్కసారి పార్టీ గుమ్మం దాటితే జగన్‌కు శత్రువులుగానే పరిగణిస్తాం…” అని ఓ సీనియర్ నేత నిన్నే చెప్పారు. అంటే ‘వైసీపి గుమ్మం దాటితే తాట తీసేస్తాం…’ అని సున్నితంగా హెచ్చరిస్తున్నట్లే భావించవచ్చు.
ఇదివరకు వైసీపి నుంచి బయటకుపోయిన కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటివారికి తమ ప్రభుత్వం ఎటువంటి ట్రీట్‌మెంట్ ఇచ్చిందో అందరూ కళ్ళారా చూశారు కూడా. కనుక ఎవరూ ధైర్యం చేసి వైసీపి గేటు దాటలేరు.
ఒకవేళ గేటు దాటి బయట అడుగుపెట్టాలనుకొన్నా వారి అధినేత జగన్ వారి చేతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను నోరారా తిట్టించారు. కనుక ఆ రెండు పార్టీల తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. కనుక బయటకు పోయే దారి లేదు.
అయితే ఒక తలుపు మూసుకుపోతే ప్రభువు మన కోసం మరో తలుపు తెరుస్తాడంటారు. అది నిజమే! వైసీపిలో జగన్ బాధితుల కోసమే తెలంగాణ నుంచి ఏపీకి దేవదూతగా వైఎస్ షర్మిల వస్తున్నారు. ఆమె వచ్చి తలుపులు బార్లా తెరిచే వరకు మంత్రి గుడివాడతో సహా జగన్ బాధితులందరూ కన్నీళ్ళు ఉగ్గబట్టుకొంటూ ‘జగన్ వెంటే నా పయనం,’ ‘టికెట్లు, మంత్రి పదవులు మాకు ముఖ్యం కాదు,’ వంటి మూస పంచ్ డైలాగ్స్ వల్లించక తప్పదు. వైఎస్ షర్మిల వచ్చే వరకు వైసీపి గుమ్మం పట్టుకు వ్రేలాడకా తప్పదు.
అమ్మా వైఎస్ షర్మిల ఇంకా ఎప్పుడు వస్తావమ్మా? కాంగ్రెస్ తలుపులు ఎప్పుడు తెరుస్తావమ్మా? ఈ పొగ భరించలేక కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి తల్లీ! అని ఎలుగెత్తి పిలవాలనిపిస్తోంది కదా?




