ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసిన గత వైసీపీ ప్రభుత్వ మద్యం కుంభకోణం కేసు ఏపీ భవిష్యత్ రాజకీయాన్ని ఆందోళనలోకి నెడుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు బయటకొచ్చిన పేర్లు గమనిస్తే ఇందులో సింహ భాగం జగన్ సామజిక వర్గానికి చెందినవారే కావడం, అందునా వారంతా జగన్ కు అత్యంత సన్నిహితులుగా, వైసీపీ కి అతి కీలక నేతలుగా ఉండడం గమనించవచ్చు.
అయితే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా మొన్నటి వరకు ఈ కేసులో ఎక్కువగా సీనియర్ నాయకుల పేర్లు వినిపించగా ఇప్పుడు తాజాగా బయటకొస్తున్న పేర్లన్నీ కూడా యువనాయకుల పేర్లు కావడం తో వైసీపీ మరో కొత్తతరం రాజకీయాన్ని కలుషితం చేసేసిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
వీరిలో ఇప్పటికే పెద్ది రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి, మరో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
వీరంతా భవిష్యత్ రాజకీయాలలోకి రానున్న యువనాయకులు. అటువంటి వారు ఇటువంటి భారీ స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు అంటే వైసీపీ రాబోయే తరానికి కూడా అవినీతి పాఠాలు నేర్పిస్తుందా.? అరాచకానికి బాటలు వేస్తుందా.? అన్న ఆందోళన ఏపీ రాజకీయాన్ని కలవరపెడుతుంది.
ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తుల అక్రమ ఆక్రమణ కేసులో జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అరెస్టయ్యి బైలు మీద బయటకొచ్చారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ వారసుడిగా, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే గా రాజకీయ అరంగేట్రం చేసిన పేర్ని కిట్టు ఇప్పటికే తన మీద రౌడీ షీట్ తో పాటు పలు కేసులు నమోదుచేసుకున్నారు.
ఇలా వైసీపీ పార్టీలో ఈ తరం నాయకుల వారసులుగా భవిష్యత్ లో రాజకీయం చేయబోయే మరో కొత్తతరం నేతలు ఇప్పటికే అవినీతి రాజకీయాలలో కూరుకుపోయారు, అరాచకవాదులుగా మారిపోయారు. సజ్జల రామకృష్ణ రెడ్డి రాజకీయ వారసుడు సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా వికృత చేష్టలకు అధిపతిగా ఇప్పటికే సమాజం నుంచి చీదరింపులు ఎదుర్కుంటున్నారు.
ఇక ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా ఆయన అవినీతి ముద్ర ఉందంటూ ఆరోపణలు రావడం , దానికి చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పాత్ర తోడవడం, తనవంతుగా మిథున్ రెడ్డి ఇప్పటికే అరెస్టవడంతో వైసీపీ భవిష్యత్ రాజకీయం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఏపీ రాజకీయాలకు ఇప్పుడే ఒక మోడల్ పిక్చర్ ఇస్తున్నారు ఆ పార్టీ అధినేత వైస్ జగన్.




