ఎమ్మెల్యేలు, మంత్రులందరి నోట తరచూ వినిపించే మాట ‘నియోజకవర్గం అభివృద్ధి.’ అంటే దానర్దం నియోజకవర్గం ఒక్కటే కాదు… ఆ కాంట్రాక్ట్ పనులలో కమీషన్లు దండుకొని తాము, తమ అనుచరులు కూడా అభివృద్ధి చెందడం అని అర్దం. కొన్ని ఇంగ్లీషు పదాలలో ‘ఎస్’ సైలెంట్, ‘ఆర్’ సైలెంట్ అని చెపుతుంటారు అలాగే ఇదీ అన్నమాట!
ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రకాశం జిల్లాలో దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఓ కార్యక్రమంలో తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎమ్మెల్యేకాగానే అత్యుత్సాహంతో నా నియోజకవర్గం అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేస్తే నేను పట్టుబట్టి మరో రూ.20 కోట్లు సాధించుకొచ్చాను. ఆ పనులన్నీ మన కార్యకర్తలకు అప్పగిస్తే వారు పూర్తిచేశారు. కానీ వాటికి సంబందించి బిల్లులు పెట్టినా ఇంతవరకు ఆ డబ్బు ఇవ్వడం లేదు. ఈ సమస్యను సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తే త్వరలో విడుదల చేస్తామని చెప్పారు,” అని అన్నారు.
దర్శి నియోజకవర్గం అభివృద్ధి వెనక కధ ఇలా ఉంటే నియోజకవర్గంలో కుమ్ములాటల కధ వేరేగా ఉంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాలు గత మూడేళ్ళుగా కుమ్ములాడుకొంటున్నారు.
బూచేపల్లి మొదటి నుంచి వైసీపీలో ఉంటూ ఎమ్మెల్యేగా కూడా చేసినందున నియోజకవర్గంపై పట్టు ఉంది. మద్దిశెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరువురికి మద్య ఘర్షణలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యేగా తాను నిధులు తెచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేద్దామనుకొంటే, బూచేపల్లి అడుగడుగునా అడ్డుపడుతున్నాడని, తన నియోజకవర్గంలో వేలుపెడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడని మద్దిశెట్టి ఆరోపిస్తున్నారు. కానీ మద్దిశెట్టే తన అనుచరులకు ఏ కాంట్రాక్టులు రాకుండా అడ్డుపడుతున్నారని బూచేపల్లి ఆరోపిస్తున్నారు. అంటే నిధుల పంపకాలలో గొడవలని చెప్పుకోవచ్చు.
వీరిద్దరి మద్య గొడవలు ఏ స్థాయికి వెళ్ళాయంటే వైఎస్సార్ జయంతి సందర్భంగా ముండ్లమూరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. దాంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరగొట్టాల్సివచ్చింది.
ఇటీవల చీమకుర్తిలో బూచేపల్లి సుబ్బారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాలను సిఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కి పిలుపురాలేదు. రాకుండా చేశారని మద్దిశెట్టి ఆరోపిస్తున్నారు. మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మద్దిశెట్టి తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేనైనా నన్ను ఇంతగా అవమానిస్తున్నా పార్టీ కోసం సహిస్తున్నాను. నేను జగన్, ప్రజల ఆదరణతోనే ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నాను. ఒకవేళ అవి కోల్పోతే కేవలం మద్దిశెట్టిగా మీ ముందుంటాను,” అని అన్నారు.
Watch and subscribe for Exclusive Interviews:



