అక్కడ ఎన్డీయేకు మద్దతు… ఇక్కడ యూరియా రాజకీయాలు!

YSRCP Protests Over Urea Shortage Across Andhra Pradesh

యూరియా కొరతని నిరసిస్తూ నేడు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల ముందు బైటాయించి ధర్నాలు, దీక్షలు చేస్తున్నాయి.

ఓ ప్రతిపక్షపార్టీగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం సహజమే. అవసరమే. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి సమస్యని వేగంగా పరిష్కరిస్తుంది. అయితే రైతు సమస్యలపై వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉందా?అంటే అనుమానమే.

ADVERTISEMENT

తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్‌ పార్టీ గత రెండు నెలలుగా పోరాటాలు చేస్తోంది. కనుక ఏపీలో కూడా యూరియా కొరత ఉంది కనుక వైసీపీ అప్పుడే పోరాటం మొదలుపెట్టవచ్చు. కానీ విదేశాల నుంచి భారీగా యూరియా ఏపీ పోర్టులలో దిగుతుంటే వైసీపీకి ఇప్పుడు మెలకువ వచ్చి యూరియా కొరత అంటూ రాజకీయ మైలేజ్ కోసం ఆరాటపడుతోంది.

సరే! కాస్త ఆలస్యమైనా వైసీపీకి నిబద్దత ఉందా? అంటే లేదనే చెప్పాలి. దీని కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు రానేలేదు! ఓ పచ్చ కండువా కప్పుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించుకున్నారు!

సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు, రైతుల మధ్యకు వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నప్పుడు, యువకుడుని.. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, మరో 25-30 ఏళ్ళు రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, ఈ సమస్యపై స్వయంగా ఎందుకు పోరాడటం లేదు? తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు ఎందుకు రావడం లేదు?

యూరియా కొరత ఒక్క ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశంలో ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి యూరియా రప్పించి పంపిణీ చేస్తోంది.

కనుక ఒకవేళ యూరియా గురించి జగన్‌ లేదా వైసీపీ ప్రశ్నించాలనుకుంటే ముందుగా ప్రధాని మోడీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ నేడు ఢిల్లీలో జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ ఎంపీలు ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతుగా ఓట్లు వేశారు!

యూరియా ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్‌ అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు పలకవచ్చు లేదా బీఆర్ఎస్‌ పార్టీలా ఈ ఎన్నికకి దూరంగా ఉండిపోవచ్చు కదా?

కానీ ఎన్డీయేలో వైసీపీ లేనప్పటికీ, అక్కడ దాని అభ్యర్ధికి మద్దతు ఇస్తూ, ఇక్కడ సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తోంది.

అంటే వైసీపీ యూరియా రాజకీయాలు చేస్తోంది తప్ప రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది కదా?

ADVERTISEMENT
Latest Stories