
దావోస్ సదస్సులో ఏపీకి పెట్టుబడులు రాకపోతే అందుకు రాష్ట్రానికి చెందిన పౌరులుగా మాజీ మంత్రి రోజా, వైసీపీ నేతలు బాధ పడాలి. ఆ తర్వాత ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించి మాట్లాడాలి. కానీ ఏపీకి పెట్టుబడులు రానందుకు ఆమె మొహం వెలిగిపోతోంది.
ఆమె మీడియా ముందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఎద్దేవా చేసిన తర్వాత జగన్ ఒకే ఒక్కసారి దావోస్ సదస్సుకి వెళితే రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని, విశాఖలో కేవలం రెండు రోజులపాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తే ఏకంగా రూ.13.50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గొప్పగా చెప్పుకున్నారు.ఇటీవల మోడీ వచ్చి శంకుస్థాపన చేసినవన్నీ జగన్ తెచ్చినవే అని ఆమె చెప్పుకున్నారు.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
ఆమెతో పాటు మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితర వైసీపీ నేతలు కూడా బయటకు వచ్చి ఇదే పాట పాడారు. చంద్రబాబు నాయుడుకి గొప్పలు చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడమే తప్ప పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడం చాతకాదని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఈ ఏడు నెలల్లో చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు పెట్టుబడులు సాధించనని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? అవన్నీ ఎక్కడున్నాయని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడున్నాయనే ప్రశ్నకు, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వాటి జీవో కాపీలను పోస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమ ఎంత పెట్టుబడితో ఏర్పాటుకాబోతోందో వివరాలు కూడా పోస్ట్ చేశారు.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
కనుక ఇప్పుడు జగన్ తెచ్చానని గొప్పగా చెప్పుకుంటున్న ఆ రూ.14.31 లక్షల కోట్లు ఎక్కడున్నాయి?వాటితో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేశారో? అవి ఏ దశలో ఉన్నాయో వాటిలో ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో చెప్పాలని వారు రోజాని, వైసీపీ నేతలని నిలదీస్తున్నారు.
ఒకవేళ నిజంగానే జగన్ హయంలో రూ.14.31 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి వాటితో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లయితే, అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ నేతలు వాటి గురించి గొప్పగా చెప్పుకొని ఉండేవారు. రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్ వంటి వైసీపీ నేతలు ఆయా పరిశ్రమల వద్దకు తరచూ వెళ్ళి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకునేవారు కదా?
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ వాటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి కనుక! అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తాము తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడని వైసీపీ నేతలు, అధికారం కోల్పోయాక ఇప్పుడు మాట్లాడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది.
సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించాలనే యావతో కనపడని ఆ పెట్టుబడులు, పరిశ్రమల గురించి చెప్పుకుంటే రేపు వాటికీ లెక్కలు చెప్పాల్సి రావచ్చు. ఆ ఫైల్స్ తిరగేస్తే ఏవో కొత్త భాగోతాలు బయటపడే ప్రమాదం కూడా ఉంటుంది.
కనుక వైసీపీ నేతలు తమకు బొత్తిగా అవగాహన, ఆసక్తి లేని ఈ పరిశ్రమలు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది. వారికి సంక్షేమ పధకాల పాటలు చాలా బాగావచ్చు. కనుక ఆ పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా?