వైకుంఠపాళీ ఆటలో పైకి వెళ్ళడానికి నిచ్చెనలు ఉన్నట్టే కిందకి పడడానికి నాగపాములు ఉంటాయి అనేది గ్రహించాలి. ఇది గ్రహించకుండా నిచ్చెనెక్కి పైకెళ్ళి సాధించేసాం అని ఎగిరిపడితే ఒక్క కాటుతో మళ్ళీ వచ్చిన దగ్గరకే వెళ్లాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
అయితే ఒక్కసారి వైసీపీ పార్టీ లో జరిగే వైకుంఠ పాళీ ని పరిశీలిస్తే, జగన్ పదవులు అనే నిచ్చెనలను ఆ పార్టీ నేతలకు అందించి పైకి పంపుతూ ఉంటే వారు మాత్రం ఆరోపణలు అనే కాటుకి గురయ్యి కిందకు పడుతూ వస్తున్నారు.
ముందుగా వైసీపీ నేత అనంతబాబు విషయానికి వస్తే ఈయన గారిని ఎమ్మెల్సీ అనే పదవితో జగన్ నిచ్చెనెక్కిస్తే హత్య ఆరోపణలతో కిందకు పడ్డారు. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే దళిత వ్యక్తిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో అరెస్టయ్యి జైలు కెళ్లి తిరిగి పార్టీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు ఈ పెద్ద మనిషి.
ఆ తరువాత లిస్టులో చిన్న పిల్లాడు అవినాష్ రెడ్డి స్థానం సంపాదించుకున్నారు. అయితే ఈయనకు కడప ఎంపీ స్థానాన్ని కేటాయించి దగ్గరుండి ఎంపీగా నిచ్చెన ఎక్కించి మరి పార్లమెంటుకు పంపారు జగన్. సొంత బాబాయ్ నే చంపేసిన నిందితుల లిస్టులో ముందు వరుసలో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి నైతికంగా పతనమయ్యారు.
ఇక తరువాత లిస్ట్ లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు వచ్చి చేరారు. ఒకరిని ఎంపీగా, మరొకరిని మంత్రిగా నిచ్చెనెక్కిస్తే వారు గంటా, అరగంట అంటూ సోషల్ మీడియాలో వికృత చేష్టలతో అడ్డంగా దొరికి నిలువునా మునిగి మాజీలుగా మారారు. పార్టీని ముంచారు.
ఇక ఈ మధ్యకాలంలో నిత్యం హాట్ టాపిక్ లో ఉంటున్నారు కొంతమంది వైసీపీ నేతలు. వారిలో 70 ఏళ్ళ విజయసాయి రెడ్డి ని రాజ్యసభకు పంపించారు జగన్. మరి ఆయనేమో జగన్ ఎక్కించిన ఢిల్లీ నిచ్చెన దిగడానికి 40 ఏళ్ళ వివాహితతో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటు విశాఖలో తేలారు.
విశాఖ లో మొదలు పెట్టిన విజయ సాయి రాజకీయ జీవితం జగన్ అందించిన నిచ్చెనతో ఒక్కసారిగా ఢిల్లీకి వెళ్లినా ఆయన మీద వచ్చిన ఆరోపణలు విశాఖ కేంద్రంగా రావడంతో మళ్ళీ ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే వచ్చి ఆగినట్టయింది. ఇక దువ్వాడ విషయానికి వస్తే ఈయన గారికి ఎమ్మెల్సీ అనే నిచ్చెనే వేశారు జగన్.
మరి ఆ నిచ్చెనను నిలుపుకోలేక ‘వాణి, మాధురి…ఓ దువ్వాడ స్టోరీ’ అనే ఆరోపణలతో దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. ఇలా వైసీపీ నేతలు పదవులతో పైకెళుతున్నారు, ఆరోపణలతో మళ్ళీ కిందకు పడుతున్నారు. ఈ వైసీపీ వైకుంఠపాళీ లో జగన్ నిచ్చెనేస్తుంటే వారి నీచ బుద్ది కిందకు దింపుతోంది.
వైసీపీలో ఇటువంటి వారికే జగన్ పదవులు కట్టబెడతారా లేక పదవులు కట్టబెట్టిన వారంతా ఇటువంటి వారేనా అనే సందేహం అటు సామాన్య ప్రజలలోను ఇటు రాజకీయ వర్గాలలోనూ వ్యక్తమవుతోంది. అయినా జగన్ లో కానీ వైసీపీ నేతలలో కానీ ఆ పార్టీ సిద్దాంతాలలో కానీ ఎటువంటి సంస్కరణలకు చోటు లేకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. .
ఇలా వైసీపీలో అర్హత లేకుండా నిచ్చెనెక్కిన ప్రతి ఒక్కరు వైకుంఠపాళీ లో కిందకు పడినట్టే కిందకు రాకతప్పడం లేదు. అయితే ఈ వైకుంఠపాళిలో కర్త వారే, ఖర్మ వారే కావడం ఇక్కడ కొసమెరుపు. ఎవరో ప్రత్యర్థి పార్టీల వారు వచ్చి నిందలు వేసి కిందకు లాగడం కాదు వారు సొంతం అనుకున్న వారి నుండే ఆరోపణలు ఎదురవ్వడం ఖర్మ ఫలమో విధి రాతో.
అది అవినాష్ విషయంలో జగన్ సొంత చెల్లి సునీత, షర్మిల నిందలు వేశారు. అలాగే విజయ, శాంతి విషయంలో శాంతి భర్త ఆరోపణలు గుప్పించారు. ఇక దువ్వాడ విషయంలో ఆయన భార్య పిల్లలే తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. అలాగే అంబటి విషయంలో కూడా ఆయన సొంత అల్లుడే ఆయన మీద ఆరోపణలు చేసారు.




