వివాదాల మయం వైవి హయాం!

YV-Subba-Reddy-హిందువుల ప్రముఖ ఆద్యాత్మిక క్షేత్రం టిటిడి బోర్డుకు ప్రభుత్వం కొత్త చైర్మన్ గా తిరుపతి యంయల్ఏ భూమన కరణాకర రెడ్డి ని నియమించింది, దాంతో నాలుగేళ్ళుగా చెర్మన్ పని చేస్తున్న వైవి సుబ్బారెడ్డి ప్రయాణం ముగిసింది. ఆయన రెండు దఫాలుగా నాలుగు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉన్నారు. చైర్మన్ గా ఆయన హయాంలో టిటిడి తీసుకున్న గుర్తించుకోదగ్గ విధాన నిర్ణయాల కంటే మూటగట్టుకున్న వివాదాలే ఎక్కువ గుర్తుంటాయి. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కింది. టిటిడి చైర్మన్ గా 2019లో ఆయన నియామకమే వివాదాలతో మెదలైంది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ 3 వారాల్లో ఆయన నియామకం ప్రకటించగానే ఆయన మతంపై వివాదం రేగింది. ఆయన క్రైస్తవడుని ఆరోపణలు వచ్చాయి. ఆయన క్రైస్తవాన్ని ఆచరించే వైయస్ కుటుంబానికి సన్నిహిత బంధువు కావడం, గతంలో ఆ మత గ్రంథం ఆయన భార్య చేతిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాల్లో రావడం వాటికి కారణం అయ్యింది. అప్పటికి వివరణ ఇచ్చుకున్నా ఇప్పటికీ దానిని నమ్మని వారెందరో తరచూ అవే ఆరోపణలు చేస్తారు. ఆ తర్వాత ఈ వివాదాల పరంపర కొనసాగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి,

* గత ప్రభుత్వం తెచ్చిన వయసు పరిమితి వల్ల తొలగించబడ్డ వివాదాస్పద ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను తిరిగి స్వామి వారి సేవలోకి తీసుకోవడం, అది అర్చకుడిగా కాక ఆగమ సలహాదారుగా తీసుకున్నారు. గతంలో పింక్ డైమండ్, పోటులో తవ్వకాలు అంటూ చేసిన ఆరోపణలపై టిటిడినే ఆయనపై పెట్టిన పరువునష్టం కేసు పెండింగులో ఉండగానే ఆయనను తిరిగి తీసుకోవడం విశేషం. ఆ ఆరోపణలతో ఆయన ప్రస్తుత అధికార పార్టీకి రాజకీయ లబ్ధి కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి.

ADVERTISEMENT

* గతంలో పింక్ డైమండ్ ఆరోపణలు చేసిన వైసిపి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ అయ్యాక దాని నిగ్గు తేలుస్తారని భావిస్తే, ఆయన ఆద్వర్యంలోని అదే టిటిడి పింక్ డైమండ్ లేదని చెప్పడం పలు విమర్శలకు దారితీసింది. రాజకీయ లబ్ధికి దేవుడిని ఉపయెూగించుకున్న చెడు పద్దతులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దానికి తగ్గట్టుగా టిటిడి రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి వంటి వారిపై పరువు నష్టం కేసు ఉపసంహరించుకుంది.

* గతంలో లోకేష్ బినామీగా ఆరోపించి వైసిపి కుటుంబ పత్రికలో అనేక కదనాలు రాసి, చానల్స్ లో అనేక వార్తలు వెలువరించిన శేఖర్ రెడ్డి అనే వ్యాపారవేత్తను వైసిపి తిరిగి బోర్డులోకి తీసుకోవడంపై అన్ని వైపుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో శేఖర్ రెడ్డి జగన్ బినామీ అని తిరిగి ఆరోపణలు వచ్చాయి.

* టిటిడి నగదు డిపాజిట్లను ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకుల నుండి తీసి వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యాలనే మరొక నిర్ణయం వివాదాస్పదమైంది. దాని వల్ల వేల కోట్ల నగదు మీద వడ్డీ పరంగా నష్టం కలుగుతుందని పలువురు వారించినా, జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ పేరుతో వాటిని తక్కువ వడ్డీ వచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేసారు. తరువాత రోజుల్లో వాటిలో కొన్ని ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి సహకరించాయని ఆరోపణలు వచ్చాయి.

* యస్వీబిసిలో తమకు రాజకీయంగా సహకరించిన నటులు, తమ వర్గానికి చెందిన టివి, సినీ ప్రముఖులను నియమించడంతో ఆరోపణలకు తావిచ్చింది. యస్వీబిసి చైర్మన్ గా నియమించబడిన పృధ్వి లైంగిక వేదింపుల ఆరోపణలతో అవమానకరంగా తొలగించబడ్డారు. ఆతరువాత ఆయనే అక్కడ ఒక వర్గపు ఆధిపత్య రాజకీయాలపై పలు ఆరోపణలు చేసారు.

* తిరుమల ప్రసాదాల రేట్లు విపరీతంగా పెరగడంపై సామాన్య భక్తుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. తయారీ ఖర్చుల సాకుతో వడ 4 రూ. నుండి 25 రూ. కు, మురుకు 4రూ. నుండి 30 రూ. కు, 100 రూ. దొరికే జిలేబీ ప్రసాదం 500 రూ పెంచడం వంటివి సాదారణ భక్తులపై కూడా ప్రభావం చూపించాయి.

* తిరుమల కాటేజిల రేట్లు 500రూ. వరకు పెంచడంపై వివాదం రేగింది. వివిధ సేవల రేట్ల పెంపుపై వేలం పాట తరహాలో టిటిడి చైర్మన్ రేట్లు ప్రతిపాదించిన వీడియెూ సోషల్ మీడియాల్లో వచ్చి వివరీతమైన విమర్శలకు గురైంది.

* ఇక 81 మందితో టిటిడి ఏర్పాటు చేసిన జంబో బోర్డుపై అన్ని వైపుల నుండి విమర్శలు వెల్లవెత్తాయి. 29 మంది మెంబర్లు, 52 రెండు మంది ప్రత్యేక ఆహ్వానితులతో కేంద్ర మంత్రివర్గం కంటే పెద్దగా ఏర్పాటు చేసారు. అంతకు ముందు 19 మంది ఉన్న బోర్డు మెంబర్లను 29 పెంచి, మరొక 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో రాజకీయ పునరావాసానికి, తమకు జాతీయ స్ధాయిలో లాబీ చెయ్యగలవారితో వీటిని నింపేసారని ఆరోపణలు వచ్చాయి. చివరికి కోర్టు ఈ 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల జాబితా రద్దు చేసింది.

* టిటిడి ఇఓగా గతంలో విమర్శల పాలై తొలగించబడిన ధర్మారెడ్డిని మళ్ళీ కేంద్ర సర్వీసుల నుంచి తీసుకువచ్చి అదే పదవిలో కూర్చోబెట్టడంపై పలు విమర్శలు వచ్చాయి. ఆయన టర్మ్ పూర్తయినా ఎక్సెటెన్షలతో కొనసాగించడం కూడా మరింత విమర్శలకు తావిచ్చింది.
బోర్డులో నియమితులైన పలువురిపై కబ్జాల ఆరోపణలు, స్కాంల ఆరోపణలు రావడంపై కూడా విమర్శలు వచ్చాయి.

* అలాగే గత ప్రభుత్వం నూతన రాజధాని అమరావతిలో 150 కోట్లతో ఘనంగా తలపెట్టిన వెంకటేశ్వరుని ఆలయాన్ని కుదించి 30 కోట్లతో చిన్న ఆలయాన్ని నిర్మించడం కూడా విమర్శలకు తావిచ్చింది. మెుదట అనుకున్నట్టు పూర్తి ప్లాన్ తో నిర్మించి ఉంటే ప్రపంచ స్ధాయి నగరంగా తలపెట్టిన అమరావతికి ప్రత్యేక శోభ వచ్చేదని చెబుతారు. తరువాత అమరావతి ఆలయ ప్లాన్ తో విశాఖలో మరో ఆలయం నిర్మించడం విశేషం.

* జమ్ము కాశ్మీర్ లో 33 కోట్లతో ఆలయం నిర్మాణం చేపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జమ్ము కాశ్మీర్ కంటే మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఎక్కువ భక్తులు తిరుమల దర్శిస్తారు, కానీ అక్కడ ఆలయ నిర్మాణం చెయ్యకుండా జమ్ములో చెయ్యడంపై అందరూ ఆశ్చర్యపోయారు.

* చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆలయ అర్చకులను డిల్లీ తీసుకు వెళ్ళి అక్కడ కొంత మంది ప్రముఖులకు వేదాశీర్వచనాలు ఇప్పించడంపై భక్తుల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఎవరైనా స్వామి వారి దగ్గరకు రావాలి కానీ, స్వామి వారి అర్చకులను వ్యక్తుల దగ్గరకు తీసుకుని వెళ్ళడం, అందులోనూ సుప్రీంకోర్టు జడ్జిలకు ఈ ఆశీర్వాదాలు అందించడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

* ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ అన్యమత డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దర్శించడంపై హిందూ సంస్థల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయినా, ఆయన గానీ, టిటిడి గానీ ఖాతరు చేయకుండా ఉండటం తీవ్ర విమర్శల పాలైంది.

* ఇక జగన్ రెడ్డి ప్రతిసారీ ఒంటరిగా దేవుడికి ప్రభుత్వ పెద్ద హోదాలో దర్శించడంపై విమర్శలు రావడం ఒకటైతే, వైవి భార్య “జగన్ రక్షక గోవిందా” అని భజనలు చెయ్యడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

* దర్శన టికెట్లు, అర్జిత సేవల టికెట్లను అమ్ముకోవడంపై అనేక ఆరోపణలు, మీడియాల్లో వార్తలు వచ్చాయి. సాక్షాత్తూ మంత్రి రోజా రెడ్డి పైనే ఈ విషయంలో ఆరోపణలు వచ్చాయంటే ఎలా జరిగి ఉంటుందో ఆలోచించవచ్చు.

* అధికార పార్టీ నాయకులు తిరుమలను రాజకీయాల కోసం వాడుకోవడం, తిరుమల్లో ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ ఆరోపణలు చెయ్యడం వంటి వాటిపై అనేక విమర్శలు వచ్చినా టిటిడి దానిని నిలువరించలేకపోవడం విమర్శలకు లోనైంది.

* పలు సందర్భాల్లో అన్యమత ప్రచారం జరగడం, అన్యమత ఉద్యోగులు ఉన్నారని ఆరోపణలు రావడం కూడా విమర్శలపాలైంది.

* శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలు వచ్చాయి. టిటిడి ఇవో దానిపై వివరణ ఇచ్చినా కూడా ఆ ఆరోపణలు ఆగకపోవడం గమనార్హం.

* చివర్లో ఎంతో కాలంగా లడ్డూల తయారీకి వాడుతున్న నందిని నేతి కాంట్రాక్టు కొనసాగించకపోవడంపై కూడా ఆరోపణలు వచ్చాయి.

ఇలా పదవి చేపట్టిన దగ్గర నుండి అనేక ఆరోపణలు, విమర్శలతో వైవి సుబ్బారెడ్డి రెండు టర్మ్ ల పదివీ కాలం పూర్తి చేసారు. కనీసం కొత్త చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయినా ఆరోపణలకు తావు లేకుండా టిటిడి గౌరవాన్ని, భక్తుల విశ్వాసాన్ని చూరగొంటారని ఆశిద్దాం.

 

-శ్రీకాంత్. సి

ADVERTISEMENT
Latest Stories