జింబాబ్వే చరిత్రలో అతి పెద్ద విజయం!

Zimbabwe vs Sri Lanka Series టాప్ టీం శ్రీలంకకు సొంతగడ్డపై అదిరిపోయే జలక్ ఇచ్చింది జింబాబ్వే. సిరీస్ లో ఇప్పటికే రెండు సార్లు 300 పరుగులకు పైగా స్కోర్లను చేధించి శ్రీలంకకు గట్టి షాక్ ఇచ్చిన జింబాబ్వే, సిరీస్ ను 2-2తో సమం చేసి, అయిదవ వన్డేలో టాస్ గెలుచుకుని బౌలింగ్ ను ఎంచుకుంది. అంతే… అక్కడ నుండి మొదలైన గెలుపు ప్రస్థానం… సికందర్ రాజా కొట్టిన సిక్సర్ తో గ్రాండ్ గా ముగిసింది. దీంతో సంబరాలు చేసుకోవడం జింబాబ్వే వంతు… సొంత గడ్డపై జింబాబ్వే చేతిలో పరాభవంతో తల దించుకోవడం శ్రీలంక వంతయ్యింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 203 పరుగులు మాత్రమే నమోదు చేసింది. గుణతిలక 52, గుణరత్నె అజేయమైన 59 పరుగులతో ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ అయినా చేయగలిగింది. జింబాబ్వే బౌలర్ సికందర్ రాజా 10 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి 3 వికెట్లను సొంతం చేసుకోగా, మరో బౌలర్ క్రిమేర్ 10 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే సమర్పించుకుని 2 వికెట్లను తీసాడు. రెండవ ఓవర్ నుండి ప్రారంభమైన లంకేయుల కష్టాలు ఇన్నింగ్స్ ఆద్యంతం కొనసాగాయి.

ADVERTISEMENT

ఇక స్వల్ప లక్ష్య చేధనను దూకుడుతో ఆరంభించింది జింబాబ్వే. ఓపెనర్ మిరే 32 బంతుల్లో 43 పరుగులు చేసి, తొలి వికెట్ కు మసకద్జాతో కలిసి 14.2 ఓవర్లలోనే 92 పరుగులు జోడించాడు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ముసకంద కూడా బాధ్యతాయుతమైన ఆడి 37 పరుగులు చేయగా, ఓపెనర్ మసకద్జా 73 పరుగులతో సత్తా చాటాడు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత ఒత్తిడికి గురైన జింబాబ్వే బ్యాట్స్ మెన్లు వడివడిగా వికెట్లు కోల్పోతూ 175 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్నారు.

అయితే ఆ తదుపరి కార్యాన్ని బౌలింగ్ జోడి సికిందర్ రాజా – క్రిమేర్ లు మరో వికెట్ కోల్పోకుండా విజయవంతంగా పూర్తి చేసారు. రాజా 27, క్రిమేర్ 11 పరుగులు జోడించడంతో 38.1 ఓవర్లలోనే 204 పరుగులు చేసి సిరీస్ ను సొంతం చేసుకుని జింబాబ్వే జట్టు చరిత్రలోనే అతి పెద్ద సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇతర దేశాలలో అంతకుముందు న్యూజిలాండ్ పై 2-1 తేడాతో, బంగ్లాదేశ్ పై 3-0తో, అలాగే కెన్యాపై కూడా విజయాలు సాధించిన జింబాబ్వే జట్టు, ప్రస్తుతం స్టార్ ప్లేయర్లు ఎవరూ లేకుండా శ్రీలంక 3-2తో మట్టి కరిపించింది.

ఇదేమి సాధారణ విజయం కాదు. బహుశా జింబాబ్వే క్రికెట్ ను మరో మలుపు తిప్పే విజయంగా అభివర్ణించవచ్చు. ఏషియన్ పిచ్ లపై ఇతర జట్లు విజయం సాధించడమంటే… అది ఆస్ట్రేలియా వంటి టాప్ టీంలు సైతం కష్టపడాల్సి ఉంటుంది. కానీ జింబాబ్వే గెలిచిన తీరు… తాము ఏ టాప్ టీంకు తక్కువ కాదనే విధంగా నిరూపించుకుంది. రెండు సార్లు శ్రీలంకపై 300కు పైగా స్కోర్లను చేధించి, ఫైనల్లో ఒత్తిడిని తట్టుకుని మరో లక్ష్య చేధన చేయడం అపూర్వం. ఆల్ రౌండ్ షో చూపించిన సికందర్ రాజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా, మసకద్జాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతమైంది.

ADVERTISEMENT
Latest Stories