పరదా కప్పి కొండని, పేరు మార్చి సుప్రీంకోర్టుని…

CM-Camp-Office-on-Rushikonda,-Vizagదాదాపు పదేళ్ళ తర్వాత కూడా ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి. అందుకు వైసీపి ప్రభుత్వం ఏమాత్రం సిగ్గు, బాధ పడటం లేదు. రాజధాని లేని రాష్ట్రం అని అందరూ ఎద్దేవా చేస్తుంటే ప్రజలు అవమానంగా భావిస్తున్నారే తప్ప వైసీపి ప్రభుత్వం కాదు.

పొరుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలోనే చక్కబెట్టుకోవచ్చు కానీ ఈ పంచాయితీని హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కల్పించుకొంది. నిజానికి రాజధాని వ్యవహారం తెలకూడదనే సుప్రీంకోర్టుకి వెళ్ళిందా? అనే సందేహం కలుగుతోంది.

ADVERTISEMENT

మూడు రాజధానుల డ్రామాతో నాలుగున్నరేళ్ళు కాలక్షేపం చేసి, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంటే విశాఖ రాజధాని అనే కొత్త డ్రామా మొదలుపెట్టింది. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు అందుకు వీల్లేదని ముందే చెప్పినా విశాఖలో ఋషికొండపై ‘పర్యాటకశాఖ కోసం’ అంటూ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మించేసింది.

ఋషికొండ నిర్మాణాలను ప్రజలు, ప్రతిపక్షాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరూ చూడకుండా దాచిపెట్టేయాలని కొండకే పచ్చటి పరదాలు కప్పేసి, చుట్టూ రేకులు అడ్డంపెట్టేసి మరీ భవనాలు, రోడ్ల నిర్మాణాలు నిర్మించేసింది. కొండలను కూడా పరదాలు కప్పి, రేకులు అడ్డం పెట్టి దాచేయాలనే గొప్ప ఆలోచన వైసీపికి మాత్రమే వస్తుందేమో?

ఉండవల్లిలో టిడిపి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడం అంటూ కూల్చివేయించిన జగన్‌ ప్రభుత్వమే ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యూనల్ వారిస్తున్నా, అనుమతి లేకుండా ఋషికొండపై సుమారు రూ. 2-300 కోట్లు ఖర్చు చేసి సిఎం క్యాంప్ కార్యాలయం వగైరాలను నిర్మించింది. కనుక వీటిని రేపు కూల్చేయక తప్పదా?

ఋషికొండనిపై నిర్మించిన భవనాలను ఉపయోగించుకోవడానికి చిత్రవిచిత్రమైన కారణాలు చెపుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా మభ్యపెట్టేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్దం అవుతోంది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రం ‘ఉత్తరాంద్రా జిల్లాల అభివృద్ధిని సమీక్షించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు’ అని చెప్పుతున్నారు.

దసరా నుంచి విశాఖ నుంచి సిఎం జగన్‌ పాలన ప్రారంభం అవుతుందని మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు చెప్పుకొంటారు. సాక్షి మీడియా కూడా విశాఖ నుంచే జగన్‌ పాలన అని వ్రాస్తుంటుంది. కానీ ఇప్పుడు కొత్త కధ వినిపిస్తోంది.

అంటే న్యాయస్థానాలను కూడా ఏమార్చాలని వైసీపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. తమ ప్రభుత్వానికి ఉన్న తెలివితేటలు న్యాయస్థానాలకు ఉండవని వైసీపి ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. కానీ ఏమార్చలేమని వైసీపి మేధావులకు తెలియదనుకోలేము.

మరెందుకు ఈ హడావుడి?అంటే మేము విశాఖను రాజధానిని చేయబోతుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ సైంధవుడిలా అడ్డుపడ్డారని, కనుక మళ్ళీ వైసీపిని గెలిపిస్తే ఈసారి తప్పకుండా విశాఖ రాజధాని సి చేస్తామని ప్రజలను మభ్యపెట్టేందుకు కావచ్చు.

ఒకవేళ హైకోర్టు, సుప్రీంకోర్టులు తమ కుంటిసాకులను నమ్మి ఈ డ్రామాలు కొనసాగించడానైకి అనుమతిస్తే “ఇదిగో చెప్పిన్నట్లే విశాఖ వచ్చేశాను… మాట తప్పను… మడమ తిప్పను. కనుక మళ్ళీ మాకే ఓట్లేయాలి,” అని చెప్పుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది.

న్యాయరాజధాని అని రాయలసీమ ప్రజలను, విశాఖ రాజధాని అని ఉత్తరాంద్ర ప్రజలను, ఋషికొండపై నిర్మించినవి పర్యాటక భవనాలు మాత్రమే అని హైకోర్టు, సుప్రీంకోర్టులని ఇలా అందరినీ మభ్యపెట్టగలమనుకొంటున్న వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి జోహార్లు!

ADVERTISEMENT
Latest Stories