పదో తరగతి ఫలితాలు: తెలంగాణలో 90 శాతం, ఏపీలో 67 శాతం?

Sabitha_Indira_Reddy_Botsa_Satyanarayana_10th_Resultsకొద్ది సేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదోతరగతి ఫలితాలు విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలలో 90 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తెలిపారు. మొత్తం 5,03,579 మంది విద్యార్దులు హాజరుకాగా వారిలో 4,53,201 మంది ఉత్తీర్ణులయ్యారు. సిద్ధిపేట జిల్లాలో బాలబాలికలు కలిపి ఏకంగా 97 శాతం ఉత్తీర్ణత సాధించడం ఇంకా అభినందనీయం.

ఈ నెల 6వ తేదీన ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. వాటిలో కేవలం 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,15,908 మంది విద్యార్దులు పరీక్షలు వ్రాస్తే వారిలో 4,14,281 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 2,01,627 మంది విద్యార్దులు ఫెయిల్ అయ్యారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో 71 పాఠశాలలో ఒక్క పదో తరగతి విద్యార్ధి కూడా పాస్ అవలేదు.

రాష్ట్రం మొత్తం విద్యార్దులు ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత ఫెయిల్ అయినవారి సంఖ్య ఒక్కరూ పాస్ కానీ పాఠశాలలు
ఆంధ్రప్రదేశ్‌ 6,15,908 4,14,281 67.26% 2,01,627 71
తెలంగాణ 5,03,579 4,53,201 90% 50,378 15

 

ADVERTISEMENT

పదో తరగతి ఫలితాలు ఇంత దారుణంగా రావడంతో పరీక్షలనే సరిగ్గా నిర్వహించలేకపోయిన జగన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అయితే కరోనా కారణంగా ఈసారి 67.26 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, గుజరాత్‌లో కేవలం 65  శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించిందని కనుక గుజరాత్‌తో పోలిస్తే ఏపీ సత్ఫలితాలే సాధించిందని సిఎం జగన్మోహన్ రెడ్డి సమర్ధించుకొన్నారు. ఇప్పుడు తెలంగాణ ఫలితాలతో పోల్చి మాట్లాడగలరా?

తెలంగాణలో కూడా గత రెండేళ్ళుగా కరోనాతో స్కూళ్ళు సరిగ్గా నడవలేదు. విద్యార్దులు చదువులకు దూరం అయ్యారు. అంటే ఏపీలో నెలకొన్న కరోనా పరిస్థితులే తెలంగాణలో కూడా ఉన్నాయని స్పష్టం అవుతోంది. కానీ అక్కడి విద్యార్దులు ఈ ఏడాది 90 శాతం ఉత్తీర్ణత సాధించగలిగారు. అంటే లోపం విద్యార్దులది కాదని స్పష్టం అవుతోంది. తెలంగాణ విద్యార్దులకు అక్కడి ప్రభుత్వం అమ్మఒడి పధకం కూడా ఇవ్వడం లేదు. కానీ విద్యావ్యవస్థను చాలా బలోపేతం చేసి సత్ఫలితాలు సాధించి చూపించింది.

అందుకే “ఏపీలో విద్యార్దులు ఫెయిల్ అయ్యారంటే జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే” అని నారా లోకేష్‌ అన్నారు. “నాడు-నేడు పేరుతో బడులకు రంగులు వేసుకొంటే పిల్లలకు చదువులు అబ్బేస్తాయా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి అమ్మఒడి, నాడు-నేడు ప్రచారార్భాటాలపై ఉన్న శ్రద్ద విద్యావ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై చూపకపోవడమే దీనికి కారణం అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories