విశాఖ రాజధాని పేరుతో విశాఖతో వైసీపీ నేతలు విశాఖ నగరంతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కబ్జాలకు పాల్పడగా, వారి అధినేత రుషికొండని కబ్జా చేసి సుమారు రూ.500 కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు చేసి తన కోసం విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకున్నారు.
విశాఖలో బస్టాండ్లపై కూడా తన ఫోటోలు పెట్టించుకున్న జగన్, 5 ఏళ్ళలో విశాఖలో కొత్తగా ఒక్క ఫ్లై ఓవర్ కట్టించలేదు. కనీసం ఒక్క రోడ్ వేయించలేదు.
జగన్ సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇచ్చారు కనుక వీటన్నిటినీ పట్టించుకోలేదని సరిపెట్టుకున్నా, రుషికొండ ప్యాలస్‌లలో ఏ గదిలో కూర్చున్నా పక్కనే ఉన్న అందమైన బీచ్ కనిపించేలా నిర్మించుకున్నప్పుడు, బీచ్ పరిసర ప్రాంతాలను కూడా చక్కగా తీర్చిదిద్దాలి కదా?
ప్యాలస్‌ల కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన జగన్ ప్రభుత్వం రుషికొండ బీచ్ వద్ద మౌలిక సదుపాయాల కల్పన కోసం కనీసం రూ.5 కోట్లు ఖర్చు చేయలేదు.
విశాఖ ప్రధాన పర్యాటక కేంద్రాలలో ఒకటైన రుషికొండ బీచ్ కానీ నిత్యం వేలాదిమంది పర్యాటకులు వచ్చే రుషికొండ బీచ్ వద్ద కనీస మౌలిక వసతులు కూడా లేవు.
సాధారణంగా సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా పర్యాటకులు బీచ్‌కి వస్తుంటారు. కానీ చీకటి పడితే రుషికొండ బీచ్ వద్ద ఎవరూ ఉండలేరు. బీచ్ మొత్తానికి ఓకే ఒక హైమస్ట్ లైట్ ఉంది. మిగిలిన ప్రాంతం అంతా చీకటి అలుముకుంటుంది. కనుక చీకటి పడితే మహిళలు, చిన్నారులు అక్కడ ఉండటం చాలా ప్రమాదకరం. ఇక రుషికొండ బీచ్‌లో ఎక్కడ చూసినా చెత్త చెదారం, మురికి వాసనతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు.
రుషికొండ బీచ్‌లో ఇటువంటి దుస్థితి నెలకొని ఉన్నందునే ‘బ్లూఫ్లాగ్ హోదా’ తొలగించబడింది. దీంతో జిల్లా పర్యాటకశాఖ, జీవీఎంసీ యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యలన్నీ పరిష్కరించడంతో, బ్లూఫ్లాగ్ ఇండియా అధికారులు వచ్చి రుషికొండ బీచ్‌ని పరిశీలించిన తర్వాత ‘బ్లూ ఫ్లాగ్’ హోదా మళ్ళీ పునరుద్దరిస్తున్నట్లు శనివారం ప్రకటించారు.
అయితే ఇటువంటి సమస్యలు ఒక్క రుషికొండ బీచ్‌లో మాత్రమే కాదు.. విశాఖలో రామకృష్ణా బీచ్, తెన్నేటి పార్క్ వద్ద బీచ్, సాగర్ నగర్ బీచ్ పాయింట్, భీమిలి బీచ్ ప్రతీ చోటా ఇదే పరిస్థితి.
నగరంలో రామకృష్ణ బీచ్ చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడ అందరూ తిరిగే చోటే నగరంలో మురికినీళ్ళు సముద్రంలో కలుస్తూంటాయి. ఆ నీటిలోనే పర్యాటకులు జలకాలు ఆడుతుంటారు. ఏటా విశాఖ సముద్రతీరం కోతకు గురవుతూనే ఉంది. కానీ ఎవరూ పట్టించుకోరు.
కనుక ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ బీచ్‌లన్నిటినీ చక్కడిద్దగలిగితే ప్రజలు, పర్యాటకులు చాలా సంతోషిస్తారు.




