ఏపీ ప్రభుత్వోద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో 800 కోట్లు హాంఫట్!

800cr debited from ap govt employees accountఆంద్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం లీలలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో సుమారు 90,000 మంది ప్రభుత్వోద్యోగుల జీపిఎఫ్ ఖాతాలలో నుంచి వారికి తెలియకుండా రూ.800 కోట్లు విత్ డ్రా చేసుకొంది.

ఉద్యోగుల సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “నిన్న రాత్రి నా జీపీఎఫ్ ఖాతాలో నుంచి 83 వేల రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. పొరపాటున జరిగిందేమో అని నేను మా ఉద్యోగ సంఘం కార్యదర్శిని అడిగితే ఆయన ఖాతాలో నుంచి కూడా 87వేలు కట్ అయినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉద్యోగులందరి జీపీఎఫ్ ఖాతాలలో నుంచి కూడా డబ్బు కట్ అయినట్లు మాకు తెలిసింది. రాష్ట్రంలో ఉద్యోగులందరికి కలిపి సుమారు రూ.800కోట్లు డెబిట్ అయ్యింది.

ADVERTISEMENT

ప్రభుత్వం మాకు ఈయవలసిన 60 నెలల డీఏ బకాయిలను మూడు వాయిదాలలో మా జీపీఎఫ్ ఖాతాలలో జమా చేసి, దానినే ఇప్పుడు గుట్టుగా వెనక్కు తీసేసుకొందని మాకు అర్దమైంది. మా జీపీఎఫ్ ఖాతాలలో జమా చేసిన డబ్బు వెనక్కు తీసుకోగా, కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఉద్యోగులందరికీ నగదు రూపంలో చెల్లిస్తామని చెప్పిన డబ్బు ఇంతవరకు చెల్లించనేలేదు. అంటే ప్రభుత్వం మా అందరికీ పంగనామాలు పెట్టిందన్నమాట!

మా జీపీఎఫ్ ఖాతాలకు ప్రభుత్వం కస్టోడియన్‌గా ఉంటుంది. కానీ మాకు తెలియకుండా మా ఖాతాలలో డబ్బును వెనక్కు తీసుకోవడం అంటే దొంగతనం చేయడమే అవుతుంది. గతంలో కూడా ఓసారి ఈవిధంగానే జరిగితే మేము మంత్రులు, ఆర్థికశాఖ అధికారుల సమావేశంలో ఫిర్యాదు చేసాము. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగానే మా డబ్బు మా ఖాతాలలో జమా చేశారు. కనుక ఆ వివాదం అక్కడితో ముగిసిపోయిందనే ఉద్దేశ్యంతో ఫిర్యాదు చేయలేదు.

కానీ మళ్ళీ నిన్న రాత్రి మా జీపీఎఫ్ ఖాతాలలో నుంచి ప్రభుత్వం డబ్బు వెనక్కు తీసుకొంది. కనుక ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నదే అని స్పష్టమైంది. మాకు తెలియకుండా మా జీపీఎఫ్ ఖాతాలలో నుంచి డబ్బులు వెనక్కు తీసుకోవడం చాలా నీచమైన పని. నేను ఇదే విషయమై ఆర్థికశాఖ కార్యదర్శిని కలిసి అడుగుదామని వెళితే ఆయన అందుబాటులో లేరు.

నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆర్థికశాఖలోని సిఎఫ్ఎంఎస్‌లో ఉన్న సిపీయు యూనిట్ వద్ద మా వేతన ఖాతాల నుంచి నగదు వెనక్కు తీసుకునే సాంకేతిక సౌకర్యం ఉంది. కనుక దానిని ఉపయోగించి మా ఖాతాలలో సొమ్మును మాకు తెలియకుండా తీసుకోవడం చాలా తీవ్రమైన నేరం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయబోతున్నాము.

మా డీఏ బకాయిలన్నీ చెల్లించేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. కానీ మళ్ళీ గుట్టుగా వెనక్కు తీసేసుకొంటోంది. నా 38 ఏళ్ళ సర్వీసులో ఏనాడు ఏ ప్రభుత్వమూ ఈవిధంగా చేయలేదు. తొలిసారిగా ఇప్పుడే చూస్తున్నాము. దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ఉద్యోగుల సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని తెలుసు. దానికి కారణం ఏమిటో అందరికీ తెలుసు. నెల తిరిగేసరికి అనేక సంక్షేమ పధకాలకు డబ్బు చెల్లించవలసివస్తోంది. బహుశః వాటి కోసమే ప్రభుత్వోద్యోగుల ఖాతాలలో నుంచి గుట్టుగా డబ్బు వెనక్కు తీసుకొని పంచిపెట్టిందేమో? దీనిపై ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎలాగూ నిలదీస్తారు కనుక అప్పుడు మళ్ళీ వేరే ఎక్కడి నుంచో తీసుకువచ్చి వారికి చెల్లిస్తుందేమో?

వచ్చే ఎన్నికలలో ఈ సంక్షేమ పధకాలే తమ పార్టీకి శ్రీరామరక్ష అని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే వాటి కోసం ఇటువంటి నీచమైన పనులు చేయడం, కుంటిసాకులు చెపుతూ సంక్షేమ పధకాలలోనే కొంత సొమ్ము కోసుకోవడం, నిబంధనల పేరుతో లబ్దిదారులను తగ్గించుకోవడం వలన వచ్చే ఎన్నికలలో వైసిపికి పడవలసిన ఓట్లు కూడా పడకపోవచ్చునని గ్రహించినట్లు లేదు.

ADVERTISEMENT
Latest Stories