రాజకీయాలలో ఒకప్పటి విలువలు ఇప్పుడు కానరావడం లేదు, అలాగే నాటి రాజకీయ నాయకుల భాష నేటి తరం రాజకీయ నేతలకు మిగుడుపడ్డం లేదు.
నోరు విప్పితే ప్రత్యర్థి పార్టీ నేత ఎంతటి వాడైనా, వయస్సుతో, రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా కనీసం ఆయనున్న రాజ్యాంగబద్ద పదవికి సైతం గౌరవం ఇవ్వకుండా అత్యంత నీచాతి నీచమైన పదజాలంతో విమర్శలు చేస్తున్నారు.
ఈ పార్టీ వారిని చూసి ఆ పార్టీ వారు ఆ పార్టీ నాయకులను చూసి ఈ పార్టీ నాయకులు ఇలా ఒకరిని చూసి మరొకరు, ఒక పార్టీని ఆదర్శంగా తీసుకుని మరోపార్టీ బూతుల తో రెచ్చిపోతుంది, ప్రత్యర్థులను రెచ్చకొడుతుంది.
అయితే ఈ తరహా రాజకీయాలను చట్టబద్దం చేసిన ఘనత మాత్రం వైసీపీ కే దక్కుతుంది. అలాగే వైసీపీ మిత్రపక్షంగా బిఆర్ఎస్ కూడా ఇదే తరహా రాజకీయంతో ముందుకెళ్తుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఇదే భాషతో ప్రత్యర్థులను ఎదుర్కుంటున్నారు.
తాజాగా ఏపీలో అంబటి వ్యవహారం తో వైసీపీ బూతు రాజకీయం మరోసారి కోరలు చాచింది. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు పైనే అంబటి బూతులతో రెచ్చిపోయారు. గతంలో కొడాలి నాని నాటిన ఈ బూతు రాజకీయ విత్తనం నేడు వైసీపీ నీడలో మహా వృక్షంగా ఎదిగింది.
ఇక నిన్న తొర్రురు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పై బూతుల దండకం ఎత్తుకున్నారు. రేవంత్ ని ఉద్దేశించి వాడు వీడు, ఆడొక పొట్టోడు, ఒరేయ్ పొట్టోడా నీకుంటది రా అంటూ ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న నేతను ఈ విధంగా పరుషపదజాలంతో విమర్శలు చేస్తూ ఆ రాజ్యాంగబద్ధ పదవిని అగౌరవపరిచారు.
ఇక అక్కడితో కూడా కేటీఆర్ శాంతించలేదు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు సమైక్యవాద నేత సంచులు మోసే బ్రోకర్…..నువ్వు, నువ్వొచ్చి ఇప్పుడు కేసీఆర్ ని ప్రశ్నిస్తావా, ఆయన పై అవినీతి ఆరోపణలు చేస్తావా,
దేవుడికి మొక్కుకో బిడ్డా, ఒకవేళ నీ ఖర్మ కాలీ రాష్ట్రంలో గులాబీ జెండా గెలిస్తే అప్పుడు నీసంగతి చూస్తా అంటూ ఒక సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉన్న నాయకుడిగా కేటీఆర్ చేసిన ప్రసంగం నిజంగా భవిష్యత్ రాజకీయాలను దిగజార్చేసాయనే చెప్పాలి.
గతంలో కేసీఆర్ కూడా ఇదేతరహాలో ప్రత్యర్థి పార్టీల నేతలను, తనకు అనుకూలంగా ఉండని నాయకులను ఇదేవిధంగా తెలంగాణ యాస పేరుతో అవమానకరంగా దూషించేవారు. ఇలా వైసీపీలో కొడాలి నుంచి అంబటి, బిఆర్ఎస్ లో కేసీఆర్ నుంచి కేటీఆర్ ఇవి వారికి రాజకీయంగా సంక్రమించిన ఆస్తుల మాదిరి భావిస్తున్నారు.
ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవి పట్లే ఈ సోకాల్డ్ రాజకీయ పార్టీలకు ఆయా పార్టీల నాయకులకు కనీస మర్యాద, గౌరవం లేకపోతే ఇక అటువంటి వారిని ఇటువంటి ఉన్నత పదవిలో కూర్చోబెడితే అది ఆ పదవికే అవమానం కాదా.? ఆ హోదాను కించపరిచనట్టు అవదా.?
ఇటు వైసీపీ అధినేతగా జగన్ అటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇద్దరు కూడా ఆయా పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులే, వారు ఇప్పుడు చేస్తున్న ఈ బూతు రాజకీయాలు కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసమే. అయితే అసలు వారికి ఆ పదవికి ఇచ్చే కనీస గౌరవం, మర్యాద తెలియనప్పుడు వారు అటువంటి పదవులు ఆశించడం అత్యాశ కాదా.?
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులతో తిడుతూ వారిని, వారి పదవిని అత్యతం హీనంగా అవమానిస్తూ అదే పదవి కోసం ప్రజల ముందుకొచ్చి ఓటడుగుతున్నారు అంటే అసలు ఆ నేతలకు ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది. ప్రజలు తిరిగి ప్రశ్నించలేరనే ఒక గట్టి నమ్మకమా.? లేదా మాకు వాక్ స్వతంత్రం ఉంది, నోటికి ఎదోస్తే అదే మాట్లాడతాం, ఇది రాజ్యాంగం మాకిచ్చిన స్వేచ్ఛ అనే అహంకార ధోరణా.?






