హైకోర్టులో అజయ్ కల్లాం పిటిషన్‌… మరో కొత్త ఎపిసోడ్‌!

Ajeya-Kallamవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆదిమధ్యంతరాలు లేని బ్రహ్మపదార్ధం వంటిదంటే అతిశయోక్తి కాదు. నాలుగేళ్ళుగా ఆ కేసులో జరుగుతున్నది ఏంటంటే ఎప్పటికప్పుడు రకరకాల కారణాలతో పిటిషన్లు పడుతుండటం వాటిపై న్యాయస్థానాలు అనేక వాయిదాల మద్య విచారణ చేపడుతుండటం. ఇంతే!

ఇందుకు తాజా నిదర్శనంగా ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజయ్ కల్లాం వేసిన పిటిషన్‌ గురించి చెప్పుకోవలసి ఉంటుంది. సీబీఐ అధికారులు 2023, ఏప్రిల్ 29న తన వద్ద నుంచి వాంగ్మూలం తీసుకొన్నారని, కానీ ఆరోజు తాను వారికిచ్చిన వాంగ్మూలం, కోర్టుకి సమర్పించిన ఛార్జ్ షీట్‌లోని వాంగ్మూలం రెండూ చాలా భిన్నంగా ఉన్నాయని అజయ్ కల్లాం తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ADVERTISEMENT

సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందనే విషయం తాను మీడియాలో చూసి తెలుసుకొని హైకోర్టులో పిటిషన్‌ వేస్తున్నట్లు దానిలో తెలిపారు.

వివేకా హత్య జరిగినరోజు అంటే 2019, మార్చి 15న తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జగన్‌ లోటస్ పాండ్ నివాసంలో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, తాను, జగన్‌ కలిసి వైసీపీ మ్యానిఫెస్టో గురించి చర్చిస్తుండగా, అటెండర్ వచ్చి డోర్ కొట్టగా కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళి అతను చెప్పింది విని వచ్చి జగన్‌ చెవిలో ఏదో చెప్పారని, వెంటనే జగన్‌ షాక్ కొట్టిన్నట్లు లేచినిలబడి బాబాయ్‌ వివేక ఇక లేరని చెప్పారని, అదే తాను కూడా వాంగ్మూలంలో పేర్కొంటే సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్‌లో వేరేగా ఉందని అన్నారు.

సీబీఐ కోర్టుకి సమర్పించిన వాంగ్మూలంలో అటెండర్ తలుపుకొడితే జగన్‌ లేచి వెళ్ళారని, అతను చెప్పింది విని మేడపైకి వెళ్ళి భార్య భారతిని కలిసి మాట్లాడి పది నిమిషాల తర్వాత కంగారుగా కిందకు వచ్చి, వివేకా చనిపోయారని తమకు చెప్పారని తాను వాంగ్మూలం ఇచ్చిన్నట్లు సీబీఐ పేర్కొందని అజయ్ కల్లాం పిటిషన్‌లో పేర్కొన్నారు.

కనుక ఛార్జ్ షీట్‌లో వక్రీకరించబడిన తన వాంగ్మూలాన్ని తొలగించవలసిందిగా అజయ్ కల్లాం న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు.

ఏ కేసులలోనైనా పోలీస్ లేదా సీబీఐ లేదా దర్యాప్తు అధికారులు వాంగ్మూలం సేకరించాలనుకొంటే తప్పనిసరిగా మేజిస్ట్రేట్ సమక్షంలోనే రికార్డ్ చేస్తుంటారు. దానిని చదివి వినిపించిన తర్వాత దానిపై మేజిస్ట్రేట్ సంతకం, వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి సంతకాలు తీసుకొంటారు. కనుక దానిలో మార్పు చేయడానికి వీలు ఉండదు.

ఒకవేళ ఛార్జ్ షీట్‌లో వేరేగా పేర్కొన్నా న్యాయస్థానాలు మేజిస్ట్రేట్ సమక్షంలో తీసుకొన్న వాంగ్మూలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటాయి. మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజయ్ కల్లాంకు ఇంత చిన్న విషయం తెలియదనుకోలేము. కానీ ఆయన హైకోర్టులో దీని కోసం పిటిషన్‌ వేశారంటే ఈ పేరుతో మరికొన్ని రోజులు ఈ కేసు విచారణ సాగదీయడానికే అయ్యుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories