సినీ పరిశ్రమకి రాజకీయాలకు మద్య చాలా బలమైన బంధం ఉంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో, ప్రకృతి విపత్తుల సమయంలో సినీ పరిశ్రమ చాలా సాయపడుతున్నప్పటికీ, చివరికి రాజకీయ పార్టీలదే పైచేయిగా నిలుస్తుందని అల్లు అర్జున్ కేసు చూస్తే అర్దమవుతుంది.
ప్రెస్‌మీట్ పెట్టి సిఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వాలని అల్లు అర్జున్‌కి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఈ ఊబిలో ఆయన మరింత కూరుకుపోయేలా చేశారని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ ఇంటికి క్యూకట్టిన సినీ ప్రముఖులలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆయనకు మద్దతుగా కనీసం ట్వీట్ కూడా చేయడం లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక్క ప్రెస్‌మీట్‌తో ఒంటరి అయిపోయారు. పుష్పరాజ్ పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యి సంధ్య థియేటర్ ఘటన గురించి వివరణ ఇచ్చుకుంటున్నారు.
మొన్న ఆయనని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఇంట్లో దూరి అతిచేశారని సర్వత్రా విమర్శలు రావడంతో ఈసారి నోటీస్ పంపించి ఊరుకున్నారు. అల్లు అర్జున్ తనంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. మొన్న కూడా ఇదేవిదంగా చేసి ఉండొచ్చు. జరిగి ఉండొచ్చు. కానీ ఎందుకో పోలీసులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలయ్యారు.
ఇక అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ తర్వాత హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్‌మీట్ పెట్టి సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్‌ని తమ పోలీస్ అధికారులు బయటకు తీసుకువచ్చిన వీడియో ఫుటేజ్‌ని మీడియాకు విడుదల చేయడం కూడా అత్యుత్సాహంగానే అనిపిస్తుంది.
ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు బీజేపి ప్రతినిధులను ఏసీబీ చేత ట్రాప్ చేయించి, ఆ వీడియోని మీడియాకు విడుదల చేసి రాజకీయ మైలేజ్ పొందాలనుకున్నారు. కానీ సీల్డ్ కవర్‌లో కోర్టుకి సమర్పించాల్సిన సాక్ష్యాధారాలను ముందుగా మీడియాకు ఎలా రిలీజ్ చేస్తారంటూ ఆ కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే కేసులు, సాక్ష్యాధారాల విషయంలో ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందన్న మాట!
బహుశః అందుకే రేవంత్ రెడ్డి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరినీ కట్టడి చేసి ఇకపై ఎవరూ ఈ కేసు గురించి ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడవద్దని ఆదేశించారు.
అలాగే అల్లు అర్జున్ ఇంటిపై కొందరు రాళ్ళతో దాడి చేసినా ఈసారి ఆయన కూడా సంయమనం పాటించారు. అభిమానులను రెచ్చిపోవద్దని సూచించారు. అంటే ఇరుపక్షాలు కాస్త వెనక్కు తగ్గిన్నట్లు స్పష్టమవుతోంది.
కనుక చట్ట ప్రకారం జరగాల్సింది జరిగితే, అల్లు అర్జున్ న్యాయపోరాటం చేసి బయటపడగలరని వేరే చెప్పక్కరలేదు. కనుక అల్లు అర్జున్ కేసు ఇటు సినీ పరిశ్రమకి, అటు రాజకీయ నాయకులకు కూడా అనేక కొత్త విషయాలు నేర్పించింది కనుక దీనిని ఓ కేసు అనే కంటే కేస్ స్టడీగా స్వీకరిస్తే అందరికీ మంచిది.
ఈ సినీ-రాజకీయ యుద్ధం వలన సినీ పరిశ్రమకి ఎంతో కీలకమైన ‘సంక్రాంతి సీజన్’ ఎలాగూ నష్టపోతుందని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలతోనే స్పష్టమైంది.
కానీ జగన్, కేసీఆర్‌లాగ రేవంత్ రెడ్డికి మొండితనం లేదు. పట్టువిడుపులు చిన్నతనం అనుకోరు. సినీ పరిశ్రమకి తాను చెప్పదలచుకున్నది చెప్పేశారు. కనుక ఇప్పుడు సినీ ప్రముఖులే చొరవ తీసుకొని పరిస్థితిని చక్కదిద్దుకోవలసి ఉంది. ప్రయత్నిస్తే ఉగాదికి మళ్ళీ అంతా చక్కబడవచ్చు.




