రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. కనుక అమరావతి కోసం శాసనసభ తీర్మానం ఓ పెద్ద డ్రామా! ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాల రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. అవే నిర్ణయించుకున్నాయి. కనుక పార్లమెంటులో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసినా ఒరిగేదేమీ లేదు.. ఇవీ అమరావతి విషయంలో వైసీపీ వాదనలు!
రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేనప్పుడు దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రాజధానులు కూడా అవసరమే లేదు కదా?
అంటే కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్ సభ్యులకు ఇవ్వన్నీ తెలియవనుకోవాలేమో? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్ననంత రాజకీయ జ్ఞానం వారెవరికీ లేకపోవడం వల్లనే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మాటలు గుడ్డిగా నమ్మి పార్లమెంటులో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ బిల్లు పెడుతున్నారేమో? అనే సందేహం కలుగుతుంది.
జగన్ చెప్పుకున్నట్లు తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చుంటే అదే రాజధాని.. రుషికొండపై కూర్చుంటే అదే రాజధాని. ఒకవేళ బెంగళూరు ప్యాలస్ లేదా లండన్ ప్యాలస్‌లో కూర్చుంటే అదే రాజధాని అవుతుంది. ల్యాండ్ లైన్ ఫోన్లని మొబైల్ ఫోన్లు రీప్లేస్ చేసినట్లు ఫిక్స్ రాజదానుల స్థానంలో ఇలా పోర్టబుల్ రాజధానులు ఏర్పాటు చేసుకోవాలేమో?
కేంద్రానికి, పార్లమెంట్‌కి ఏపీకి రాజధానిగా అమరావతిని ఖరారు చేసే అధికారమే లేదని జగన్ తేల్చిచెప్పేశారు. కనుక పార్లమెంటులో బిల్లుని ఖండిస్తూ రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకే ఉందని చెప్తున్న నోటితోనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ శాసనసభలో చేసిన తీర్మానం కూడా చెల్లదని చెపుతున్నారు! ఒకే నోరు రెండు రకాల మాటలు!
నిజానికి నేడు లోక్‌సభలో జరుగుతున్నది ఏమిటి? అంటే విభజన చట్టంలో 2024, జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, తర్వాత తెలంగాణకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌కి ‘కొత్త రాజధాని’ ఏర్పాటవుతుందని పేర్కొంది.
కానీ అదెక్కడో, దాని పేరేమిటో విభజన చట్టంలో పేర్కొనలేదు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లుగా ‘అమరావతి రాజధాని’ అని చట్ట సవరణ చేయబోతోంది.
అంటే జగన్ అండ్ కో వాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకున్నట్లే కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించి ఆమోదముద్ర వేస్తోంది తప్ప తనంతట తానుగా నిర్ణయించడంలేదని స్పష్టమవుతోంది కదా?




