రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడం ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచింది… అని సిఎం చంద్రబాబు నాయుడు గ్రహించినందునే అటువంటి దయనీయ పరిస్థితిలో కూడా అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ‘మళ్ళీ మనమే’ అని జగన్‌లాగ భ్రమించకుండా సిఎం చంద్రబాబు నాయుడు మూడేళ్ళ గడువు విధించుకొని నిర్మాణ పనులు చేయిస్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలోగా రాజధాని అమరావతికి రూపురేఖలు ఏర్పడటం ఖాయమే.
రాజధాని లేకపోవడం బాధిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కంటే చాలా మెరుగైన అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికా బద్దంగా కొత్త రాజధాని అమరావతి నిర్మింపబడుతున్నందుకు చాలా సంతోషం కలుగుతుంది.
హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా వంటి మహా నగరాలు ప్లాన్డ్ సిటీలు కావు కనుక వాటిలో ఈ కార్యాలయాలన్నీ వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటు అయ్యాయి. కానీ అమరావతి ప్లాన్డ్ సిటీ కనుక ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఐటి కంపెనీలు, యూనివర్సిటీలు ఎక్కడెక్కడ ఉండాలో అన్నీ ముందుగానే నిర్ణయించుకొని కట్టుకుకోగలుగుతున్నాము.
ఉదాహరణకి అమరావతిలో సీడ్ యాక్సస్ రోడ్ పక్కన ఉద్దందరాయపాలెంలో ఏకంగా 20 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, ఎల్‌ఐసీ, న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఇన్‌కమ్ టాక్స్, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, ఏపీసీఓబీ వంటివన్నీ ఏర్పాటు కాబోతున్నాయి!
కనుక రాష్ట్ర రాజధానిలో ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ ఇలా ఒకేచోట ఏర్పాటు అవుతుండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందడం ఖాయం.
ఈ నెల 28న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వాటన్నిటికీ ఒకేసారి శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకేసారి ఇన్ని బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల భవనాలకు శంకుస్థాపన జరగడం సరికొత్త రికార్డ్. ఒకే చోట ఇన్ని బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉండటం మరో రికార్డ్…. కాదా?







