దూరదృష్టి అవసరమే.. కానీ నేల విడిచి సాము ప్రమాదం!

Amaravati Land Issue and Farmers’ Concerns Explained

అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా అనిపించవచ్చు. కానీ ఆ తర్వాత ఎన్నికలలో వాటి వలననే ఎదురుదెబ్బలు తగులుతుంటాయి.

ఉదాహరణకు అమరావతి నిర్మాణం కొరకు కూటమి ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించింది. కానీ వారికి న్యాయం చేయడంలో చాలా ఆలస్యం జరిగింది.

ADVERTISEMENT

నయాన్నో భయన్నో భూసేకరణ చేసినా, దానిపైనే ఆధారపడిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి, ఇచ్చిన హామీ ప్రకారం వారికి రాజధానిలో నివాస, వాణిజ్య స్థలాలు కేటాయించి, వాటిని వారికి రిజిస్ట్రేషన్లు చేయించి ఉండి ఉంటే రైతులలో వ్యతిరేకత ఏర్పడేది కాదు.

కానీ భూసేకరణ తర్వాత రైతుల సమస్యలను పక్కన బెట్టి అమరావతి నిర్మాణం హడావుడిలో పడిపోయారు. అది రైతులను చాలా బాధించింది. అందుకే వారు టీడీపికి దూరమయ్యారు. అది వైసీపీకి కలిసి వచ్చింది.

కూటమి ప్రభుత్వం వారికి న్యాయం చేయనప్పుడు, వైసీపీ వారికి న్యాయం చేసి ఉండి ఉంటే వారు జగన్‌ని నెత్తిన పెట్టుకునేవారు. కానీ జగన్‌ ప్రభుత్వం వారిని వేధించింది. కమ్మరావతి, శ్మశానం, వేశ్యల రాజధాని అంటూ వారిని దారుణంగా అవమానించింది.

కనుక వారు చంద్రబాబు నాయుడే తమకు న్యాయం చేయగలరని నమ్మారు. ఎన్నికలలో వైసీపీని దించి టీడీపిని గెలిపించారు.

జగన్‌ అధికారంలోకి వచ్చినప్పుడు తాను కోరుకున్నదే చేశారు తప్ప ప్రజలు కోరుకున్నది చేయలేదు. ప్రజలు రాజధాని, అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురు చూస్తుంటే, వారిని సంక్షేమ పధకాలతో జోల పుచ్చాలనుకున్నారు.

ప్రభుత్వమంటే ఎల్లప్పుడూ ఛార్జీలు, పన్నులు పెంచి పీడించడమే తప్ప ఎన్నడూ పైసా ఇవ్వడం చూడని ప్రజలు, జగన్‌ ప్రభుత్వం అప్పనంగా డబ్బు ఇస్తుంటే కాదంటారా? కనుక 5 ఏళ్ళు ఆయన ఇస్తున్న డబ్బు తీసుకుంటూనే ఉన్నారు.

కనుక వారందరూ తనకి రుణపడ్డారని, అందుకుగాను ఎన్నికలలో వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తారని జగన్‌ అనుకున్నారు. కానీ గద్దె దించేశారు. ఎందుకంటే వారి ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగించారు గాబట్టి.

ఈవిదంగా ఒకరు చేసిన తప్పుల వలన మరొకరు అధికారంలోకి వస్తున్నప్పుడు, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి కదా?

కానీ సిఎం చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నారని, అందువల్ల మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని జగన్‌ గట్టిగా నమ్ముతున్నారు. ‘రప్పా రప్పా’ అంటూ గొడ్డలితో నొక్కి మరీ చెపుతున్నారు కదా? అది అత్యాశ కావచ్చు కానీ దురాశ కాదు.

ముందే చెప్పుకున్నట్లు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నందున అమరావతిలో పెద్ద విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వగైరా చాలా అవసరమని భావిస్తున్నారు. కనుక ప్రభుత్వం మరో 30-40 వేల ఎకరాల భూసేకరణకు సన్నాహాలు మొదలుపెట్టింది.

కానీ మొదటి విడత భూనిర్వాసితులకే ఇంతవరకు న్యాయం జరుగలేదు. నేటికీ సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కనుక రెండో విడత భూసేకరణలో రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.

కానీ ప్రభుత్వం ముందుకే సాగాలనుకుంటోంది. కనుక సమస్య మళ్ళీ పునరావృతం అవుతోందని అర్ధమవుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతి నిర్మిస్తున్నప్పుడు, దానికి తగ్గట్లుగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండాలనే సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచనని ఎవరూ తప్పు పట్టలేరు. ఆయన దూరదృష్టికి అభినందించాల్సిందే.

కానీ రైతుల జీవనోపాధి అయిన వ్యవసాయ భూములు తీసుకుంటున్నప్పుడు, వారి జీవనోపాధికి భంగం కలగకుండా వీలైనంత వేగంగా నష్టపరిహారం చెల్లించడం చాలా ముఖ్యం.

కాదు… కుదరదు అనుకుంటే రైతులతో పాటు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ నష్టపోతుంది. కనుక పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకొని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ప్రజలకు, రైతులకు నష్టం, కష్టం కలిగించకుండా ముందుకు సాగితే మంచిది.

ADVERTISEMENT
Latest Stories