అమరావతికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసినప్పటి నుంచి అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. వాటిలో వైసీపీ లేవనెత్తిన లక్షల కోట్ల ఖర్చు, నిర్మించడానికి 20-30 ఏళ్ళు సమయం పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒక ఇంటిని కట్టుకోవడానికి ఇన్ని లక్షలు లేదా కోట్లు ఖర్చవుతుందని, ఇన్ని నెలలు లేదా ఏళ్ళలో నిర్మించుకోవచ్చనే అంచనాతోనే పనులు మొదలుపెడతారు. కనుక అమరావతి గురించి ఇలాంటి సందేహాలు కలగడం సహజం.
కానీ అమరావతిని మూడేళ్ళలో పూర్తిచేస్తామని మంత్రి నారాయణ పదేపదే చెప్తున్నారు. మూడేళ్ళలో సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి.
కానీ రాజధానిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, అధికారక నివాసాలు, రోడ్లు, మౌలికవసతులు వంటివి పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి కాక క్వాంటం వ్యాలీ, వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులు వగైరాలు నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం వాటికి అవసరమైన భూములు మాత్రమే ఇస్తుంది. వాటి నిర్మాణ ఖర్చులు, పర్యవేక్షణ ఆయా సంస్థలే చూసుకుంటాయి.
కనుక అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందనే వాదనలు రాజకీయ దురుదేశ్యంతో లేదా అనాలోచితంగా చేస్తున్నావే అని చెప్పొచ్చు.
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం భూసేకరణ చేసి, ప్లానింగ్, డిజైనింగ్ చేయించుకొని, నిధులు సమీకరించుకొని నిర్మాణ పనులు మొదలుపెట్టడానికే సుమారు రెండేళ్ళు పట్టింది. కానీ మిగిలిన మూడేళ్ళలో శరవేగంగా నిర్మాణ పనులు జరిగాయి.
అమరావతి నిర్మాణం పూర్తికానప్పటికీ ప్రభుత్వం వినియోగించుకునే స్థితికి వచ్చింది. అమరావతిని తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ కూడా అమరావతిలో కూర్చొనే 5 ఏళ్ళు పాలన చేశారు కదా?అమరావతే లేకుంటే? ఎక్కడ కూర్చునేవారు?
జగన్ కూడా విశాఖ రాజధాని అని వాదిస్తూ రుషికొండపై ప్యాలస్‌లు నిర్మించుకున్నారు. దేనికంటే విశాఖ రాజధాని పని చేయాలంటే ముఖ్యమంత్రికి ఓ కార్యాలయం ఉండాలనే ఉద్దేశ్యంతోనే కదా? అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో కార్యాలయాలు, అధికారిక నివాసాలు నిర్మిస్తున్నారు.
అప్పటితో పోలిస్తే ఇప్పటికే అమరావతిలో చాలా మార్పొచ్చింది. వివిధ దశలలో ఉన్న నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కనుక రాబోయే మూడేళ్ళలో అవన్నీ అందుబాటులోకి వస్తాయి. వాటన్నిటినీ ప్రభుత్వం వినియోగించుకోగలదు. మిగిలిన వాటిని క్రమక్రమంగా నిర్మించుకుంటూ వినియోగించుకోవచ్చు.
2014 నుంచి 2029 వరకు అమరావతి నుంచే వరుసగా మూడు ప్రభుత్వాలు నడిచినప్పుడు రాబోయే మూడేళ్ళలో పూర్తయ్యే భవనాలు సరిపోవా? అప్పుడు మరింత అద్భుతమైన రాజధానిగా అమరావతిగా నిలుస్తుంది కదా? కనుక హైదరాబాద్, ఢిల్లీ ముంబాయి, బెంగళూరు నగరాలలాగ సకల హంగులతో అమరావతి 2029లోగా కళ్ళ ముందు ప్రత్యక్షమవ్వాలని కోరుకోవడం అవివేకమే.
నేటికీ హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తూనే ఉన్నాయి కదా?మరి అమరావతిని కూడా అలా నిర్మిస్తుంటే ఏడ్పులు దేనికి?
వాటితో పోలిస్తే అమరావతికి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ పూర్తి ప్లాన్డ్ సిటీ! భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం వద్ద భూమి సిద్ధంగా ఉంది. కనుక మెల్లమెల్లగా నిర్మించుకోవచ్చు. ఒకేసారి లక్షల కోట్లు తెచ్చి ఖర్చుపెట్టాలనే వాదన అర్ధరహితం.




