ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ‘ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి మాత్రమే’ అని తీర్మానం చేసి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ఇదివరకు వైసీపీలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు టీడీపి మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు.
కనుక నేడు శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో పాల్గొంటూ, “లంకలో ఉన్నవాళ్ళందరూ రాక్షసులు కారు. ఆనాడు వైసీపీలో ఉన్న మాలాంటి వాళ్ళు కొందరం మూడు రాజధానుల నిర్ణయం సరికాదని జగన్మోహన్ రెడ్డికి నచ్చజెప్పేందుకు మా స్థాయిలో మేము చాలా ప్రయత్నించాము. కానీ అయన వినలేదు. ఆయన మాట కాదంటే అప్పుడు మాకూ మీ (టీడీపి)గతే పట్టేది. కనుక అందరం నోరు మూసుకున్నాం.
కానీ నేను ఆనాడు చెప్పాను. ఈరోజూ అదే మాట చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతి అవసరమని. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజల మద్య చీలికలు, గందరగోళం సృష్టించాలనుకున్నారు. అదే చేశారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి పనులు శరవేగంగా చేయిస్తుంటే, రాష్ట్రం మొత్తం ఖర్చు చేయాల్సిన డబ్బంతా తెచ్చి అమరావతిలో పోసేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
కానీ వాస్తవం ఏమిటంటే ఈరోజుల్లో రైతుల నుంచి ఓ పదెకరాలు తీసుకొని వెంచర్ వేయాలంటేనే కనీసం 20, 30 కోట్లు వారి చేతిలో పెట్టాలి. కానీ అమరావతిలో రైతులు ఒక్క రూపాయి అడక్కుండా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ఏకంగా 34,000 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు.
అమరావతిపై ఏడాదికి కేవలం రూ.14,000 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఓ బిల్డర్ వందెకరాల వెంచర్ వేస్తే 5 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించగలడు. అలాంటిది ఏకంగా 34,000 ఎకరాలలో అమరావతి నిర్మిస్తే… ఏడాదికి కనీసం లక్ష కోట్లు పైనే ప్రభుత్వానికి రాబడి వస్తుంది. సిఎం చంద్రబాబు నాయుడుకి ఇంత దూరదృష్టి ఉంది కనుకనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డోకా లేదు.
తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్, తమిళనాడుని చెన్నై, కర్ణాటకని బెంగళూరు ఏవిధంగా పోషిస్తున్నాయో అదేవిధంగా ఈ ఒక్క అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోషించగలదని బిల్డర్‌గా నాకున్న అనుభవంతో చెప్తున్నా,” అని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఆయనే ఇంత క్లియర్ చెప్పాక ఇంకా వివరణలు సవరణలు అవసరం లేదు కదా?






