పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో ‘శ్యామ్ బాబు’ అనే పాత్రతో తనను అనుకరిస్తూ చేయించిన డ్యాన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు మొదట స్పందిస్తూ, “గెలిచినోడి డాన్స్ ఆనంద తాండవం!ఓడినోడి డాన్స్ కాళరాత్రి!” అంటూ సింపుల్‌గా తేల్చేశారు.
ఆ తర్వాత “శ్యాంబాబు అని వేరే పేరు పెట్టుకోవడం దేనికి?నేరుగా రాంబాబు అని నా పేరే పెట్టుకోవచ్చు కదా?” అని అన్నారు. అంటే ఆ పాత్రను తాను చాలా లైట్ తీసుకొంటున్నట్లు సూచించారనుకోవచ్చు.
అయితే అప్పటికి బ్రో సినిమా చూడలేదని చెప్పారు. కనుక ఆ తర్వాత బ్రో చూసి ఉండొచ్చు.
అందులో నటుడు పృధ్వీ చేత శ్యాంబాబు పాత్రతో తనను ఎంతగా అవహేళన చేశారో చూసినప్పటి నుంచి మంత్రి అంబటి ‘చిందులు’ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్, బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
మొదట బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, కనీసం పవన్ కళ్యాణ్ తీసుకొన్న పారితోషికం కూడా తిరిగిరాలేదన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన వద్ద ఉన్న బ్లాక్ మనీని నిర్మాత ద్వారా ఈ సినిమాపై పెట్టించారని ఆరోపించారు. తనను ముఖ్యమంత్రిని చేసేందుకు సాయపడుతున్నందుకు పవన్ కళ్యాణ్‌కు కూడా ఆయనే ఈవిదంగా పారితోషికం ముట్టజెప్పి ఉండవచ్చని ఆరోపించారు.
మళ్ళీ అంతలోనే ఈ సినిమాకు పవన్ కళ్యాణే పెట్టుబడి పెట్టారని కానీ ఫ్లాప్ అవడంతో దానిని బ్రతికించుకొనేందుకే ‘శ్యామ్ బాబు’ పాత్రపై మీడియాలో హైలైట్ అయ్యేలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. తనవంటి పెద్దమనిషిని అవహేళన చేసినందుకే బ్రో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అన్నారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాలేవీ హిట్ అయ్యే అవకాశం లేదన్నారు.
అయినా ఆయన కోపం చల్లారిన్నట్లు లేదు. త్వరలో తాను కూడా పవన్ కళ్యాణ్ బయోపిక్ తీస్తానంటూ దానికి మూడు పెళ్ళిళ్ళు-ఆరు తాళులు, అంటూ ఓ అరడజను పేర్లు చెప్పారు. అయినా మంత్రి అంబటి ఆగ్రహం చల్లారిన్నట్లు లేదు.
ఈ సినిమా పెట్టుబడి విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి ఫిర్యాదు చేసేందుకు బుదవారం రాత్రి ఢిల్లీ బయలుదేరబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున వైసీపీ ఎంపీలందరూ అక్కడే ఉన్నారు. వారి సాయంతో ఈడీకి ఫిర్యాదు చేయాలని మంత్రి అంబటి భావిస్తున్నట్లు సమాచారం.
మొదట ‘గెలిచోనోడిది ఆనందతాండవం… ఓడినోడికి కాళరాత్రి’ అంటూ ట్వీట్ చేసిన మంత్రి అంబటి ఇప్పుడు ఈవిదంగా చిందులు వేస్తుండటం గమనిస్తే ఆయనకు బాగానే కాలిన్నట్లు అర్దమవుతోంది.
అయితే పదవి, చేతిలో అధికారం, నోరు, దురద అన్నీ ఉన్నాయి కదా అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులని నోటికి వచ్చిన్నట్లు అవహేళన చేస్తున్నప్పుడు వారు కూడా మనసులో ఎంతో బాధపడి ఉంటారని మంత్రి అంబటి భావించలేదు. కానీ ఇప్పుడు బ్రో సినిమాలో తనని అనుకరిస్తూ ఓ పాత్ర పెడితే ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు’ అది తనని అవహేళన చేయడమే అంటున్నారు. ఆనంద తాండవం చేస్తానన్న అంబటి రాంబాబు ఇప్పుడు చిందులు వేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉండగా ఆయన ఢిల్లీ వెళ్ళి ఈడీకి ఫిర్యాదు చేసినా, కోర్టులో పరువు నష్టం దావా వేసినా ఏం ప్రయోజనం?తన పరువు తానే తీసుకొన్నట్లవుతుంది కదా?పైగా ఆయన బ్రో గురించి ఎంతగా మాట్లాడితే అంతా దానికి ఆయనే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన్నట్లు కూడా అవుతుంది. ఇంతవరకు బ్రో సినిమా చూడనివారు కూడా ‘శ్యాంబాబు’ని ఓసారి చూసొద్దామని బయలుదేరితే, బ్రో సూపర్ హిట్ అవడానికి ఆయనే సాయం చేసిన్నట్లవుతుంది కూడా!



