సంక్రాంతి పండుగ అంటే సినిమాలు, కోళ్ళ పందేలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు వగైరా జాబితాలో సత్తెనపల్లిలో మన సంబరాల రాంబాబు డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేరింది.
కానీ అంబటి రాంబాబు ఎన్నికలలో ఓడిపోయారు. పైగా జగన్ ఆయనని సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగించేశారు. కనీసం తన అనుచరుడికి ఆ పదవి దక్కేలా చేయాలని ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆయన స్థానంలో డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
సత్తెనపల్లి వైసీపీలో ఆయన వ్యతిరేకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని తీసుకు రావలనుకోగా ఆయన తన అనుచరుడు ఆళ్ళ శ్రీనివాస రెడ్డిని నియమించాలనుకున్నారు. ఒకవేళ ఆయన అనుచరుడిని నియమిస్తే సత్తెనపల్లిలో వైసీపీ ఖాళీ అయిపోతుందని వారు హెచ్చరించడంతో మధ్యే మార్గంగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని నియమించారు.
జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబుకి పోలవరం ప్రాజెక్టు గురించి ఐడియా లేకపోయినా సినిమాల విషయంలో చాలా అప్‌డేట్‌గా ఉంటారు.
Also Read – కేటీఆర్.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…
కనుక ఈసారి సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలలో ఏదో ఓ సినిమాలో పాటని ఎంచుకొని డాన్స్ ప్రాక్టీస్ చేసి సంక్రాంతికి సత్తెనపల్లి ప్రజలను తప్పక రంజింపజేసి ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక ఈసారి ఆయన డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుందో లేదో? అని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు.
పదవికి, రాజకీయాలకు, రోడ్లపై డాన్సులకు సంబంధం లేదని మన సంబరాల రాంబాబు అధికారంలో ఉన్నప్పుడే నిరూపించి చూపారు. కనుక ఈసారి సత్తెనపల్లిలో వాతావరణం అనుకూలించకపోయినా, ప్రజలు తనకి ఓట్లు వేయకపోయినా ఎప్పటిలాగే సత్తెనపల్లిలో రికార్డింగ్ డాన్స్ చేసి రంజింపజేస్తారు. బాలకృష్ణ టీడీపీకి చెందినవారు. డాకూ మహరాజ్‌ని పక్కన పెట్టేసి గేమ్ చేంజర్‌లో పాటకి డాన్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
ఒకవేళ ఈసారి ఆయన సత్తెనపల్లిలో డాన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో రోజూ చేస్తూనే ఉంటారు. కనుక ప్రజలు ఆయనని ‘మిస్’ అయ్యే అవకాశం లేనేలేదు.