అయ్యా అంబటి… కాస్త మీశాఖ గురించి ఏదైనా ట్వీట్‌ చేయొచ్చు కదా?

Ambati Rambabuరాంగోపాల్ వర్మ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో ఏవిదంగా పాపులర్ అయ్యారో, అదేవిదంగా అంబటి రాంబాబు మంత్రిగా కంటే ట్విట్టర్‌లో ఎక్కువగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినా, లేదా ట్వీట్‌ చేసినా వాటిలో ముఖ్యాంశాలు ఒక్కటే… చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను ఎద్దేవా చేయడమే. కనుక ఆయన ఏ శాఖకి మంత్రో రాష్ట్రంలో చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు.

ADVERTISEMENT

అయితే నిత్యం తమ ప్రత్యర్ధులను నోరారా అవహేళన చేసే అంబటి రాంబాబు, బ్రో సినిమాలో ఒక్క నిమిషం పాటు కనిపించే శ్యాంబాబు పాత్రని చూసి కుతకుత ఉడికిపోయారు. అంటే ఆయన ఎదుటవారిని నోటికి వచ్చిన్నట్లు ఏమైనా మాట్లాడొచ్చు కానీ ఎదుటవాళ్ళు ఆయనను ఏమీ అనకూడదని ఆశిస్తున్నారన్న మాట. ఇది సాధ్యమా?

ఎప్పటిలాగే మళ్ళీ అంబటి రాంబాబు తమ ముగ్గురు ప్రత్యర్ధులను ఉద్దేశ్యించి చక్కటి ప్రాసతో ఓ ట్వీట్‌ వేశారు. “బాబుగారు బస్సు ఎక్కాడు పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు దత్తపుత్రుడు లారీ ఎక్కాడు కానీ …గద్దెనెక్కడం అసాధ్యం !” అని ట్వీటారు. దానిలో ‘బాబుగారు’ అని సంభోదిస్తున్నప్పుడు ‘బస్సు ఎక్కారు’ అని వ్రాయాలి కానీ ఆయనపై ద్వేషం ‘ఎక్కాడు’ అని వ్రాయించేలా చేసింది.

దీనిని పక్కనపెడితే, ఆ ముగ్గురూ ఎంత శ్రామించినా గద్దెనెక్కలేరని అంబటి జోస్యం కూడా చెప్పారు. అయితే ఇలాంటి ట్వీట్స్ చేసే బదులు ప్రాజెక్టుల గురించి చంద్రబాబు నాయుడు అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చి సాగునీటిశాఖ గురించి తనకు కూడా అవగాహన ఉందని నిరూపించుకోవచ్చు కదా?

ట్విట్టర్‌లో ఎంతసేపు చిలకజోస్యం చెప్పుకొనే బదులు తన శాఖలో ఏవైనా పనులు జరుగుతున్నట్లయితే వాటి గురించి రాష్ట్ర ప్రజలకు వివరించి, ప్రభుత్వం పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం కలిగించవచ్చు కదా?కానీ ఆయన ‘డయాఫ్రామ్ వాల్వ్’ దగ్గర ఆగిపోయి చాలాకాలమే అయ్యింది. కనుక ప్రాజెక్టుల గురించి మాట్లాడవలసివస్తే అదొక్కటే చెపుతుంటారు పాపం!

మొదట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్‌ లభిస్తే చాలానుకొంటారు. తర్వాత గెలిస్తే చాలనుకొంటారు. గెలిచాక మంత్రి పదవి లభిస్తే చాలనుకొంటారు. కానీ మంత్రి పదవి కూడా లభిస్తే చివరికి ట్విట్టర్‌లో ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి మంత్రి పదవులు అవసరమా?

ADVERTISEMENT
Latest Stories