అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడింది చాలా తక్కువ.
ఒకవేళ మాట్లాడాల్సివస్తే పోలవరం, డయాఫ్రమ్ వాల్వ్, కాఫర్ డ్యామ్ అనే మూడు ముక్కలను తిప్పితిప్పి చెపుతూ చంద్రబాబు నాయుడుని విమర్శించి ముగించేవారు.
చివరికి ఓ మంచి రోజు చూసుకొని ‘పోలవరం ప్రాజెక్టు గురించి నాకు అవగాహన లేదని, అది ఎప్పటికీ పూర్తవుతుందో కూడా తనకు తెలీదని’ అంబటి రాంబాబు ఒప్పేసుకున్నారు.
కనుక తనకు అవగాహన లేని క్లిష్టమైన సాగునీటి ప్రాజెక్టుల సబ్జెక్ట్ గురించి మాట్లాడటం కంటే తనకు బాగా పట్టున్న సబ్జెక్ట్ అదే.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శించడం, సంక్రాంతికి సత్తెనపల్లి రోడ్లపై రికార్డింగ్ డాన్సులు చేస్తూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేశారు.
జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడని అంబటి రాంబాబు, ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు లేదా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నప్పుడు, తాను మాజీ మంత్రినని, వారికి ‘కౌంటర్ ఇవ్వాల్సిన విభాగం’ తనదేనని గుర్తువస్తుందో ఏమో హడావుడిగా రెండు కాగితాలు పట్టుకొని మీడియా ముందుకు వచ్చేసి గలగలా మాట్లాడేస్తుంటారు.
కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడే సాగునీటి ప్రాజెక్టుల గురించి అవగాహన పెంచుకొని మాట్లాడి ఉండి ఉంటే చాలా గౌరవం లభించేది. కానీ అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు కూడా అవగాహన లేకుండా మాట్లాడితే నవ్వులపాలవుతానని గ్రహించినట్లు లేరు.
ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతి తెస్తాను.. రాయలసీమకు హంద్రీ-నీవాతో నీళ్ళందిస్తాను.. పోలవరం 2027కల్లా పూర్తి చేస్తానని గొప్పలు చెప్పుకున్నారని కానీ ఏం సాధించారు.. ఎలా సాధిస్తారో చెప్పాలని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా మరి బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతి కోరితే ఎందుకు తిరస్కరించిందని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు ఒప్పుకొని నిర్మిస్తూ 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచర్ల ద్వారా రాయలసీమకు ఏవిదంగా నీళ్ళు తీసుకువెళతారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
బనకచర్ల ప్రాజెక్టు పేరు చెప్పి టీడీపీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేసి, వారి నుంచి కమీషన్లు తీసేసుకొని చేతులు దులుపుకుపోవాలని ఆరాటమే తప్ప రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకి లేదని అంబటి రాంబాబు తేల్చి చెప్పేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల పేరుతో రాజకీయాలు చేస్తే అర్దం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వైసీపీ కూడా ఆ పేరుతో రాజకీయాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
పోలవరం గురించి అంబటి రాంబాబుకి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి నిరూపించుకున్నారు. దాని ఎత్తు 45.72 మీటర్లకు తగ్గించడం చాలా తప్పని జగన్ పలుమార్లు వాదించారు. కానీ అంబటికి ఈ విషయం తెలియదు కనుక 41.15 మీటర్లంటూ ఏదేదో మాట్లాడేశారు. కనుక అక్కడే ఆయన వాదనలు అర్దరహితమని తేలిపోయింది.
బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతి సాధించడానికి కేంద్రంలో పలుకుబడి ఒక్కటే సరిపోదు. ఈ ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి కూడా చెక్ పెట్టాల్సి ఉంటుందని, దానికి కొంత సమయం పడుతుందనే విషయం అంబటి రాంబాబుకి తెలియకనే ఇలా మాట్లాడుతున్నారనుకోవాలా?
జగన్ ఏనాడూ పోలవరం, హంద్రీ నీవా పూర్తిచేస్తానని కానీ వాటితో నీళ్ళిస్తానని గానీ చెప్పలేదు. కనుక అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన దృష్టి అంతా బటన్ మీదనే ఉండేది కనుక!
కనుక సిఎం చంద్రబాబు నాయుడు వాటిని పూర్తిచేసి నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటానని చెపుతున్నప్పుడు, ఎవరైనా మెచ్చుకుంటారా? లేదా పూర్తిచేయలేకపోతే.. అని వితాండవాదం చేస్తూ విమర్శిస్తారా? బియ్యం పొయ్యి మీద పెట్టగానే అన్నం ఎందుకు ఉడకలేదని అడుగుతున్నట్లే ఉంది అంబటి మూర్ఖపు వాదనలు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోతే ఎన్నికలలో ఆయనని నిలదీసి అడిగే అవకాశం వైసీపీకే లభిస్తుంది కదా?
అయినా 5 ఏళ్ళ వైసీపీ పాలనలో కనీసం బుడమేరు కాలువ గట్లు కూడా నిర్మించలేకపోవడం వల్లనే విజయవాడకు వరదలు వచ్చాయి కదా?
చివరిగా అంబటి రాంబాబుకి ఒక ప్రశ్న: అవగాహనలేని సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడి నవ్వుల పాలవడం అవసరమా?




