అమిత్ షా అనుమతితోనే చంద్రబాబుని అరెస్ట్?

Amit-Shah-Chandrababu-Naiduమాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు, రిమాండ్ మీద జైలుకి పంపినప్పుడు కూడా సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పందిస్తూ ఖండించారు. ఇది కేవలం రాజకీయకక్ష సాధింపేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మరో ఆసక్తికర విషయం ప్రస్తావించారు.

ADVERTISEMENT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి తీసుకొనే జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అమిత్ షా అనుమతిలేనిదే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపే సాహసం జగన్ చేయలేరని అన్నారు. కాస్త లోతుగా ఆలోచిస్తే నారాయణ వాదన నిజమని అర్దమవుతుంది.

ఏపీలో బీజేపీకి ఏమాత్రం ప్రజాధరణ, పెద్దగా బలం లేనప్పటికీ మూడు రాజకీయపార్టీలను తన గుప్పెట్లో పెట్టుకొని ఏవిదంగా శాసిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. వైసీపి, టిడిపి, జనసేన మూడు ప్రధానపార్టీలు వేర్వేరు కారణాలతో బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటున్న సంగతి తెలిసిందే.

నారాయణ చెప్పిన్నట్లు అమిత్ షా అనుమతిలేనిదే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసే సాహసం జగన్ చేయరు. ఒకవేళ చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే అడ్డుకొని ఉండేది కదా?కనుక ఏపీ విషయంలో ఇంతకాలం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న బీజేపీ అధిష్టానం, వైసీపి వైపు మొగ్గుచూపుతున్నట్లు చంద్రబాబు నాయుడు అరెస్టుతో స్పష్టమైంది.

చంద్రబాబు నాయుడు అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖండించినప్పటికీ అది లాంఛనప్రాయంగా చేసినదే అని వేరే చెప్పక్కరలేదు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈ అరెస్టును ఖండించడమే కాక ఆయనకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంద్‌కు మద్దతు పలికారు కూడా. కానీ బీజేపీ పెద్దల అనుమతి లేనందున ఏపీ బీజేపీ ఖండన ప్రకటనతో సరిపెట్టింది. అంటే కేంద్రం అనుమతితోనే చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి, జైలుకి పంపిందని స్పష్టమవుతోంది.

కనుక ఇప్పుడు టిడిపి, జనసేన పార్టీలే బీజేపీ పట్ల తమ వైఖరిని పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా అది తొందరపాటే అవుతుంది కనుక రెండు పార్టీలు రాబోయే రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories