ఎప్పుడూ తనదే పైచేయిగా ఉండాలనుకొనే తెలంగాణ సిఎం కేసీఆర్ క్రమంగా బిజెపి ధాటికి దిగిరాక తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనే ముందు ఆయన చేత మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉపఎన్నికలు తెచ్చి పెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్న కేసీఆర్‌కు ఇది మరో అగ్ని పరీక్షే అని చెప్పక తప్పదు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఓడిపోతే పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగని గెలిస్తే టిఆర్ఎస్‌కు కొత్తగా ఓరిగేదేమి ఉండదు. ఎందుకంటే ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతూ, ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడవలసి రావడం ఓ విదంగా రాజకీయ పరాజయమే! మునుగోడు ఉపఎన్నికలతో సిఎం కేసీఆర్‌ను ఓ మెట్టు దిగేలా చేశారు అమిత్ షా.
అమిత్ షా ఇప్పుడు కేసీఆర్‌ను మరో మెట్టు దిగేలా చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. కానీ సిఎం కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హడావుడిగా అందుకు సిద్దమవుతున్నారు! కారణం అమిత్ షా అమలు చేసిన వ్యూహమే!
ఈసారి కేంద్ర ప్రభుత్వమే సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. రాజుగారు తలుచుకొంటే దెబ్బలకు కరువా?అన్నట్లు ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలతో పరేడ్ నిర్వహించడానికి చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. కనుక రాష్ట్ర బిజెపి నేతలు భారీగా జనసమీకరణ చేసి చాలా అట్టహాసంగా నిర్వహించనున్నారు.
ఇది కేసీఆర్ కూడా ఊహించని పరిణామమే. కనుక నేడు హడావుడిగా మంత్రివర్గ సమావేశం సమావేశం ఏర్పాటు చేసి సెప్టెంబర్ 17ను ‘జాతీయ సమైక్య దినం’గా ‘అధికారికంగా నిర్వహించాలని’ నిర్ణయించారు. భారత్ వజ్రోత్సవాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్య దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు.
గత 8 ఏళ్ళుగా బిజెపి నేతలు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కేసీఆర్‌ని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదు. కానీ అమిత్ షా ఒకే ఒక పావు కదపగానే కేసీఆర్ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు. బిజెపి ‘విమోచన దినోత్సవం’ అంటే కేసీఆర్ ‘జాతీయ సమైక్య దినోత్సవం’ అని వేరే పేరుతో అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఇది ఖచ్చితంగా బిజెపి విజయమే అని చెప్పవచ్చు.
కేసీఆర్‌కు వంతపాడే మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ వ్రాశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా కాక జాతీయ సమైక్య దినోత్సవంగా జరపాలని దానిలో కోరారు. నిజానికి ఇది కేసీఆర్ చేసిన విజ్ఞప్తిగానే భావించవచ్చు. కానీ కేసీఆర్ అంతటివాడిని బలవంతంగా రెండు మెట్లు దిగేలాచేసిన అమిత్ షా ఆ మాత్రం గ్రహించలేరనుకోవడం అవివేకమే.
ఒకవేళ అలా చేస్తే అప్పుడు మళ్ళీ కేసీఆర్‌దే పైచేయి అవుతుంది. అదే… సెప్టెంబర్ 17న ‘విమోచన దినోత్సవం’గానే నిర్వహిస్తే ఆ సభలో నైజాం నవాబుల నిరంకుశత్వం గురించి, ఆ పేరుతో ఓవైసీలను వారితో అంటకాగుతున్నందుకు కేసీఆర్‌ని ఘాటుగా విమర్శించే అవకాశం ఉంటుంది.
కనుక ఈసారి సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఒకరు విమోచనం అంటే మరొకరు సమైక్యం అంటున్నారు. గ్లాసులో సగం నీళ్ళు ఖాళీ అన్నా గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయన్నా ఒకటే కదా?



