బిజెపిలో కూడా అసంతృప్తి రాగాలు… చీలిక తప్పదా?

Amit-Shah-Narendra-Modi--Nitin-Gadkari2014 సార్వత్రిక ఎన్నికలతో జాతీయ రాజకీయాలలోకి వచ్చిన నరేంద్రమోడీ, అమిత్‌ షాలు కలిసి బిజెపిలో లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, యశ్వంత్ సిన్హా, శత్రుఘన్ సిన్హా వంటి అనేకమంది సీనియర్ నేతలను పక్కకు తప్పించేశారు. ఆ తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో తమకు ఎదురులేకుండా చేసుకొన్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ మొదట్లో ప్రజల ఆకాంక్షల ప్రకారమే ముందుకు సాగుతుంటంతో దేశప్రజలవన్నీ బిజెపి అంతర్గత వ్యవహారాలుగా పరిగణించి చూసి చూడనట్లు ఊరుకొన్నారు.

ADVERTISEMENT

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయినప్పటికీ మోడీపై నమ్మకంతో అన్ని ఓపికగా భరించి 2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించారు కూడా. అప్పటికే బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ, ఆ ఎన్నికల దెబ్బతో పూర్తిగా నిర్వీర్యం అవడంతో ఇక మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లేరు. అప్పటి నుంచే మోడీ-అమిత్‌ షా ద్వయం వైఖరిలో చాలా మార్పు వచ్చింది.

రాష్ట్రాల అధికారాలను హరించివేస్తూ, ఆర్ధిక ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. మరోపక్క దేశంలో ఒక్కో రాష్ట్రంలో ప్రభుత్వాలను కూలద్రోస్తూ దొడ్డిదోవన అధికారం చేజిక్కించుకోవడం మొదలుపెట్టారు. లొంగకపోతే ఐ‌టి, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ లొంగదీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

మోడీ-అమిత్‌ షా ద్వయం వైఖరిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నాయి. కానీ ఇప్పుడు బిజెపిలో అత్యంత సీనియర్ నేత, మోడీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన, సీనియర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా వారి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బిజెపిలో, కేంద్ర ప్రభుత్వంలో ఏవిషయాన్నైనా ధైర్యంగా మాట్లాడగల నాయకుడు ఆయన ఒక్కరే. పలు సందర్భాలలో ఆయన మోడీ-అమిత్‌ షా ద్వయం వైఖరిని తప్పు పడుతూ మాట్లాడారు. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో బిజెపిలో అత్యున్నతమైన విధాన నిర్ణయాక మండలి అయిన పార్లమెంటరీ బోర్డులో నుంచి నితిన్ గడ్కారీని తప్పించేశారు. అయినా నితిన్ గడ్కారీ ఏమాత్రం వెనక్కుతగ్గడం లేదు.

మహారాష్ట్రలో నాగ్‌పూర్‌కి చెందిన ఆయనకు ఆర్ఎస్ఎస్‌ బలమైన సంబందాలున్నాయి. ఆ కారణంగా ఆర్ఎస్ఎస్ ఆయనకు అండగా నిలబడుతోంది లేకుంటే ఆయన కేంద్రమంత్రి పదవి కూడా ఊడిపోయేదే.

మోడీ-అమిత్‌ షా ద్వయం దేశవ్యాప్తంగా ప్రజా ప్రభుత్వాలను కూల్చివేస్తూ బిజెపిని విస్తరిస్తున్నప్పటికీ, వారిద్దరి ఈ వైఖరి కారణంగానే దేశవ్యాప్తంగా బిజెపి పట్ల ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతోందని పార్టీలో సీనియర్లు భావిస్తున్నారు. కనుక బిజెపిని, తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వారు నితిన్ గడ్కారీవైపు మొగ్గు చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే బిజెపిలో చీలిక తప్పకపోవచ్చు. కానీ మోడీ-అమిత్‌ షా ద్వయం అంతవరకు చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోరు కనుక బిజెపిలో ఏం జరుగబోతోందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories