ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ పరిస్థితి, ఏడాది పాలన తర్వాత ఇప్పటి వైసీపీ పరిస్థితిని బేరీజు వేసుకొని చూస్తే తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది.
మొదట్లో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. అందరూ మౌనంగా ఉండిపోయారు. కొందరు భయంతో రాజకీయ సన్యాసం కూడా ప్రకటించారు.
నేటికీ జగన్ తాడేపల్లి ప్యాలస్ విడిచి బయటకు రావడం లేదు. కానీ అయన ఒక్క పిలుపు ఇస్తే వైసీపీ ముఖ్య నేతలతో సహా వేలాదిగా వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేస్తున్నారు.
జగన్ పరామర్శయాత్ర అంటే వైసీపీ బలప్రదర్శన యాత్రలుగా మారాయి. పల్నాడు పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ‘రప్పా రప్పా’ మారుమ్రోగిపోతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వంపై జగన్ రాజకీయంగా పైచేయి సాధించారని అనుకోవాలా?
జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మీడియా, టీడీపి నేతలు ఎంతగా విమర్శిస్తున్నా వైసీపీలో ఎవరూ భయపడటం లేదు. ఎందువల్ల?
ఇటీవల జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులని పరామర్శించేందుకు వస్తే, స్థానిక వైసీపీ నేతలు డజన్ల కొద్దీ ట్రాక్టర్లతో ‘కలెక్టర్ కాయలు’ (తోతాపురీ మామిడి కాయలు) తీసుకువచ్చి రోడ్లపై పారబోశారు.
జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని, అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి రాజకీయాలు చేస్తుంటేనే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఒకవేళ పాదయాత్ర మొదలుపెట్టి రోజూ ప్రజల మద్య తిరిగితే పరిస్థితి ఏవిదంగా ఉంటుందో?
ఏ పార్టీకైనా నేతలు, కార్యకర్తలు, ప్రజలలో అభిమానులు ఉంటారు. కానీ జగన్ జైలుకి వెళ్ళివచ్చినా మళ్ళీ మద్యం కుంభకోణం కేసు అవినీతికి పాల్పడ్డారని, అమరావతిని భ్రష్టు పట్టించేశారని, జగన్ ధోరణి వలననే రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, అప్పులు పెరిగిపోయాయని తెలిసి ఉన్నప్పటికీ, నేటికీ ఆయన కోసం లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారంటే, ఇంతమంది అభిమానం, నమ్మకం పొందగలుగుతున్న జగన్ చాల అదృష్టవంతుడే అని భావించాల్సి ఉంటుంది.
జగన్‌తో సహవాసం చేస్తే కేసులు, జైలు తప్పవని తెలిసి ఉన్నప్పటికీ వైసీపీ నేతలు ఆయననే బలంగా అంటిపెట్టుకొని ఉండటం, ఆయన చెప్పినట్లుగా అరాచక రాజకీయాలు చేసేందుకు వెనుకాడకపోవడం ఆలోచించాల్సిన విషయాలే.
అలాంటి నేతలను నమ్ముకొని లక్షలాది వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఎందుకు రెచ్చిపోతున్నారు? ఈవిదంగా జగన్‌ని నమ్ముకొని వైసీపీ నేతలు, వారిని నమ్ముకొని కార్యకర్తలు రెచ్చిపోవడానికి కారణం ఏమిటి? కేవలం అభిమానమేనా లేదా మరేదైనానా? అని కూటమి ప్రభుత్వమే ఆలోచించాల్సి ఉంది.
ఎన్నికలలో వైసీపీకి సుమారు 40 శాతం ఓట్లు పోలయ్యాయి. వైసీపీ తాజా పరిస్థితి చూస్తే ఆ శాతం ఇంకా పెరిగిందా?అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ పెరిగితే ఎందువల్ల?
అంటే జగన్ తాడేపల్లి ప్యాలస్ కూర్చొని అరాచక రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాదిస్తున్నారా? లేదా జగన్, వైసీపీలను ఎదుర్కోవడంలో టీడీపి, జనసేనలు అలసత్వం ప్రదర్శిస్తుండటం వలననే, వైసీపీ ఇంతగా బలపడిందా? అని కూటమి ప్రభుత్వం ఆలోచింఛి చేతులు కాలక ముందే జాగ్రత్త పడటం మంచిది.






