సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మరోమారు తనదైన రీతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడాను కూడా జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారని… తండ్రి అధికారంలో ఉండగా… దోచుకుని, దాచుకున్న ప్యాకేజీలే జగన్ కు తెలుసని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏపీ పునర్నిర్మాణంపై జగన్ కు కనీస అవగాహన లేదని, ప్రత్యేక ప్యాకేజీ అంటే జగన్ దృష్టిలో అవినీతి సంపాదనేనని, అదే ఆయనకు గుర్తుకు వస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం, చట్టం గురించి జగన్ కు ఏమాత్రం తెలియదని… రాజకీయాల్లో ‘విద్యార్థి’ మాత్రమే అయిన జగన్, అవినీతి సంపాదన విషయంలో మాత్రం ‘ప్రొఫెసర్’ అంటూ ఆనం పేల్చిన పంచ్ లు యధావిధిగా నవ్వులు పూయించాయి.
ఇక మంత్రులకు దక్కిన ర్యాంకులపై స్పందించిన వివేకా… పురపాలక శాఖామంత్రి నారాయణపై ప్రశంసలు కురిపించారు. మంత్రిగా చివరి ర్యాంకులో నిలిచిన నారాయణ, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మాత్రం మొదటి స్థానంలో నిలుస్తారని కితాబిచ్చారు.



