ప్రభుత్వాలకు ఆర్ధిక ఇబ్బందులు…ఎందుకీ పరిస్థితి.?

Andhra Pradesh and Telangana States Financial Problems

సామాన్యుడి నుండి సెలబ్రెటీల వరకు అందరి జీవితాలను తలక్రిందులు చేయగలిగిన సత్తా ‘రూపాయి’కే సాధ్యం. డబ్బు అనేది కరెన్సీ పేపర్ లు కాదు కలర్ పేపర్లు మాత్రమే అంటూ చెప్పే హితబోధలు, సూక్తులు అన్ని కూడా చెప్పుకోవడానికే కానీ ఆచరించడానికి సాధ్యం కాదనేది వాస్తవం.

అయితే ఒకప్పుడు సామాన్యుడు మాత్రమే అనుభవించే ఈ ఆర్ధిక ఇబ్బందులు ఇప్పడు లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశ పెట్టె ప్రభుత్వాలు కూడా భరిస్తున్నాయి. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది, శాఖలలో డబ్బులు నిల్, బకాయిలు ఫుల్, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షిణించింది…అనే మాటలు ఇప్పుడు సాధారణమగా అన్ని ప్రభుత్వాల నాయకుల నుండి ప్రజలు వింటున్న వాస్తవాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ADVERTISEMENT

ఒకప్పుడు ‘అన్నపూర్ణ’గా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ‘అప్పులప్రదేశ్’ గా ఖ్యాతి గడించింది. రాష్ట్ర విభజనతో ఆర్ధికంగా కుదేలైన ఏపీ, నూతన అభివృద్ధి విధానాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ గా వెలుగొందుతుంది అనుకుంటే తలకు మించిన సంక్షేమ పథకాలతో అప్పులాంధ్రగా దిగజారింది.

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఆర్ధికంగా పాతాళానికి చేరిన ఏపీ, వైసీపీ హయాంలో కనీసం సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించే పరిస్థితి లేక అప్పులు చేసి, ప్రభుత్వ ఆస్తులను తాకట్లు పెట్టి అవసరాలను తీర్చుకుంది. సంక్షేమ బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి మంత్రం జపించని వైసీపీ ఏపీ ఆర్థిక పరిస్థితిని ఊహకు అందని రీతిలో సర్వ నాశనం చేసింది.

నాడు నవరత్నాల పేరుతో ఏపీలో మొదలైన ఆర్ధిక విధ్వంశం నేడు సూపర్ సిక్స్ గా అవతరించింది. ఈ ఉచిత పథకాల పంపిణీలతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నానాటికి చిన్నాభిన్నమవుతున్నా అటు రాజకీయ పార్టీలలో కానీ ఇటు సాధారణ ప్రజలలో కానీ ఎటువంటి చలనం కనిపించడం లేదు. నానాటికి ఉచితాలు సముచితాలే అనేలా ప్రభుత్వాలు, ప్రజలు సంక్షేమ పథకాలకు బానిసలుగా మారుతున్నారు.

ఈ జాడ్యం ఒక్క ఏపీకి మాత్రమే పరిమితం కాలేదు, అటు మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టింది కూడా మోతాదుకు మించిన సంక్షేమమే అంటున్నారు ఆర్థిక వేత్తలు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘దివాళా దిశగా’ తెలంగాణ.? అంటూ ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలవెన్స్ లు సకాలంలో చెల్లించేందుకు కూడా ప్రభుత్వం వద్ద ఆర్ధిక పరిస్థితి లేదని, అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా ఇప్పుడే వారికి అందచేసే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదంటూ తెలంగాణ అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యల పై ఒక ఆంగ్ల పత్రిక ఈ రకమైన కథనాన్ని ప్రచురించింది.

అటు ఏపీలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అంచనా వేయకుండా ఇబ్బడి ముమ్మడిగా ఉచిత పధకాలను ప్రకటించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర ఖజానాను చూసాకా ఇవి ప్రభుత్వాలకు మోయలేని భారాలు అనే విషయాలను గ్రహించాయి. అయినా చేయగలిగిందేమీ లేదు.

అప్పోసప్పో చేసి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చెయ్యాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ప్రజా సమస్యలను కూడా పరిష్కరించలేని సంక్షేమాలతో ప్రజలకు ఒరిగేదేమిటి.? ప్రభుత్వాలకు మిగిలేదేమిటి.? రాజధాని నిర్మాణాన్ని కూడా పణంగా పెట్టి సంక్షేమ బటన్లు నొక్కిన జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కిందా.? అలాగే కాళేశ్వరం అంటూ బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎత్తిపోతల పథకం ఆ పార్టీని ఓటమి నుంచి ఒడ్డున పడేయగలిగిందా.?

అలాగే ఇక రాబోయే ఎన్నికలలో విజయం సాధించడానికి ఇంతకు మించి ఉచిత పథకాలు ప్రకటిస్తే తప్ప ప్రజలను తమ పార్టీలకు ఓటర్లుగా మలచుకోలేని పరిస్థితి రాజకీయ పార్టీలది. ఇలా ఈ ఆర్ధిక భారం నానాటికి శృతి మించి ఏదోఒక నాడు ఉచితమనే అమృతమే కాలకూట విషమై సమాజన్ని నాశనం చేస్తుంది. ఈ నేరం ప్రజలదా.? రాజకీయ పార్టీలదా.? అంటే గుడ్డు ముందా.? కోడి ముందా అన్న చందంగానే జవాబు లేని ప్రశ్నగా మిగులుతుంది.

ఇప్పటి ప్రభుత్వాలు గత పాలకులను, గత ప్రభుత్వాలు అప్పటి ప్రతిపక్షాలను నిందిస్తూ, ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పడు తమ రాజకీయ లబ్ది కోసం రాజకీయ పార్టీలు ప్రజలను ఏమారుస్తు, మభ్య పెడుతూ అప్పులతో కంటికి కనిపించే సంక్షేమాన్ని చూపిస్తూ కంటికి కనిపించని ఊభిలోకి నెట్టేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories