షర్మిలని నమ్మి కాంగ్రెస్‌లో చేరొచ్చా లేదా సార్?

Andhra Pradesh Congress YS Sharmila

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టగానే చాలా దూకుడుగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తన నాయకత్వంపై, ఏపీ కాంగ్రెస్‌పై ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌ వైపు చూస్తున్న ఇతర పార్టీలలోని నేతలకు నమ్మకం కలిగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

పదేళ్ళుగా కోమాలో ఉండిపోయిన ఏపీ కాంగ్రెస్‌ని ఆమె వెంటిలేటర్ మీద నుంచి కిందకు దింపి జనం మద్యకు తీసుకు వస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ కూడా ఆమె రాగానే కోమాలో నుంచి లేచి ఫైటింగ్ మొదలుపెట్టిన విలన్‌లాగ 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దమవుతుండటం విశేషం.

ADVERTISEMENT

కానీ ఆమెను నమ్మి కాంగ్రెస్‌లో చేరొచ్చా లేదా?అంటూ ఏపీలోని మూడు ప్రధాన పార్టీలలోని అసంతృప్త, అసమ్మతి నేతలు చర్చించుకుంటున్నారు. వారి భయాలకు బలమైన కారణాలే ఉన్నాయి.

1. తెలంగాణలో సొంత పార్టీ నేతలకు హ్యాండిచ్చి ఏపీకి వచ్చేసిన ఆమెను నమ్మితే తర్వాత మనకీ హ్యాండ్ ఇవ్వరనే గ్యారెంటీ ఏమిటి?అనే అనుమానం.

2. రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు నేటికీ ఆంధ్రాలో కాంగ్రెస్ పట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొనే ఉంది. కనుక కాంగ్రెస్‌లో చేరితే ప్రజలు ఓట్లు వేస్తారా?అనే అనుమానం, భయం.

3. ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనం ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాంటప్పుడు ఆమెను నమ్ముకుని కాంగ్రెస్‌లో చేరి చేతులు కాల్చుకోవడం అవసరమా?అనే ఆలోచన.

4. వైఎస్ షర్మిల, టిడిపి, జనసేనలకు పరోక్షంగా తోడ్పడేందుకే వచ్చారని జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపి నేతలు వాదిస్తున్నారు. కనుక ఆమెను నమ్ముకొని కాంగ్రెస్‌లో చేరితే ఏమవుతుందో?అనే భయం, అనుమానం.

5. పదేళ్ళుగా రాష్ట్రంలో వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నా, ఎన్నికలని చూసి అవి కూడా తత్తరపడుతున్నప్పుడు, పదేళ్ళ తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చిన ఏపీ కాంగ్రెస్‌ ఎన్నికలలో పోటీ చేయగలదా?చేసినా ప్రజలు పట్టించుకుంటారా?అనే ధర్మసందేహం.

6. ఒకవేళ వైసీపి గెలిచి జగన్మోహన్‌ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అప్పుడు షర్మిల ఏమి చేస్తారు? అన్నతో చేతులు కలిపి వైసీపిలో చేరిపోతారా? లేక ఆయనే చెల్లికి ఏదో ఓ పదవి ఇచ్చి పార్టీలో చేర్చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటి?అనే దూరాలోచన.

7. ఒకవేళ ఎన్నికలలో వైసీపి ఓడిపోయి, టిడిపి, జనసేనలు అధికారంలోకి వస్తే, వైఎస్ షర్మిల ఎటువైపు ఉంటారు?అన్నవైపా… టిడిపి, జనసేనలవైపా? అనే అనుమానం.

8. వైసీపి లేదా టిడిపి, జనసేనలలో ఏదో ఒకటి ఎలాగూ గెలుస్తాయి. అప్పుడు మరో 5 ఏళ్ళపాటు ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె రాజకీయ నిరుద్యోగిగా ఉండగలరా?ఒకవేళ రాజ్యసభ సీటు తీసుకొని ఆమె జంప్ అయిపోతే తమ పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన.

కనుక వైఎస్ షర్మిల వచ్చి కాంగ్రెస్‌ గేట్లు తెరిచి, ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోమని తొందరపెడుతుంటే, ఎంతమంది సీనియర్ నేతలు క్యూ కడతారో చూడాలి. బహుశః వారికి ఇవన్నీ ఆలోచించుకునేందుకు ఎక్కువ సమయం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీ కాంగ్రెస్‌ నేటి నుంచి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టేసిందేమో కూడా?

ఆమెను నమ్ముకుని సీనియర్ నేతలు ఎంతమంది వస్తారో తెలీదు కానీ రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులు చాలా మందే ఉన్నారు. వారికి పైన చెప్పుకున్న అనుమానాలు, భయాలు, ఆలోచనలు ఉండవు. పైగా మూడు ప్రధాన పార్టీలు వారికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందున, వారందరూ టికెట్ల కోసం ఆంధ్రరత్న భవన్‌ ముందు క్యూ కట్టడం ఖాయమే.

ADVERTISEMENT
Latest Stories