ఆనాడు టాలీవుడ్‌… ఈనాడు ఉద్యోగ సంఘాల నేతలు సేమ్ టూ సేమ్!

Andhra-Pradesh-Govt-Employees-YS-Jaganనిన్న మొన్నటి వరకు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తగ్గేదేలే అన్నారు. కానీ ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ పరిస్థితి చూసిన తర్వాత మిగిలిన సంఘాల నేతలందరికీ జ్ఞానోదయం కలిగినట్లుంది. ముఖ్యమంత్రి వద్ద కాళ్ళ బేరానికి దిగిపోయారు.

తమ ప్రయోజనాలు సాధించుకోవడానికి వారు ఓ మెట్టు దిగితే ఎవరూ తప్పు పట్టరు. కానీ నిన్న మొన్నటివరకు జగన్ ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించినవారే మొన్న ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు పోటీలు పడి ప్రశంశించడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

“మీరు భేష్… మీ ప్రభుత్వం భేష్… మీ పాలన ఇంకా భేష్! మీ సంక్షేమ పధకాలు భేష్… వాటికి మీరు ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చుకొని టంచనుగా బటన్ నొక్కుతున్న తీరు ఇంకా భేష్! కలయో వైష్ణవమాయయో అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందిపోతోంది. మీ ప్రభుత్వంలో పనిచేసే భాగ్యం దక్కడం మా పూర్వజన్మ సుకృతం. మాట తప్పని… మడమ తిప్పని మీరు మాకిచ్చిన హామీలను అమలుచేస్తే ధన్యులమవుతాము…” కాస్త అటూ ఇటూగా ఉద్యోగ సంఘాల నేతల మాటల సారాంశం ఇదే.

కనుక ఇక వారు పోరాడేది… సాధించగలిగేది ఏమీ లేదని తేలిపోయింది. కనుక జగనన్న దయ తలిచి ఏది ఇస్తే దానిని వినయంగా పుచ్చుకోవలసిందే.

ఉద్యోగ సంఘాల నేతల ఈ మాటలని వింటున్నప్పుడు, కొంతకాలం క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులందరూ కూడా ఇదేవిదంగా సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడిన విషయం గుర్తువస్తుంది.

తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మారాజులు చిరంజీవి, ప్రభాస్‌, మహేష్ బాబు, దిల్‌రాజు, రాజమౌళి వంటివారందరూ చేతులూ జోడించి మరీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడ్డారు. కానీ వారి మొర ఆలకించలేదు. సినీ నియంత్రణ చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంది!

కనుక ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోదనే భావించవచ్చు. కానీ ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో మాకు తెలుసని వారందరూ చెప్పుకొని, ‘వైసీపీ శత్రుమూకలుగా’ పరివర్తన చెంది ప్రతీకారం తీర్చుకొనేందుకు తగిన సమయం కోసం వేచి చూస్తుండవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకొని, మరో 25-30 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించబోతున్నామని గట్టిగా చెపుతున్న జగనన్నను ఈ శత్రుమూకలు, తోడేళ్ళ గుంపులు ఏం చేయగలవు?

ADVERTISEMENT
Latest Stories