ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. కానీ ఆయా కళాశాలలో అంతర్గతంగా ప్రధమ సంవత్సర పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
Also Read – మీడియా వారు జర భద్రం…!
ఇంటర్ రెండు సంవత్సరాలకు కలిపి ఒకేసారి నిర్వహించబోయే పరీక్షలు మాత్రం ఇంటర్ బోర్డ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. విద్యార్ధులపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతికా శుక్లా చెప్పారు.
చాలా ఏళ్ళుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరుగలేదు. కనుక సైన్స్, ఆర్ట్స్, భాషల పాఠ్యాంశాలలో మార్పులు చేస్తామని చెప్పారు.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
జాతీయ స్థాయి సిలబస్ ప్రకారం 2024-25 నుంచి పడవ తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడుతున్నామని కనుక అందుకు తగ్గట్లుగా 2025-26 నుంచి ఇంటర్ ప్రధమలో కూడా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడుతామని కృతికా శుక్లా తెలిపారు. ఈ సంస్కరణలతో విద్యార్ధులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో పాల్గొని ఉత్తీర్ణులయ్యేందుకు మరింత ఎక్కువ అవకాశం కలుగుతుందని చెప్పారు.
ఈ సంస్కారణలపై విద్యార్ధులు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానిస్తున్నామని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ సంస్కరణలు అమలుచేస్తామని కృతికా శుక్లా తెలిపారు.
Also Read – మంచుతో మనకెందుకు లోకేష్ భయ్యా?
సాధారణంగా పదో తరగతి విద్యార్ధులలో కనిపించే అమాయకత్వం, మాట తీరు ఇంటర్ ప్రధమకి వచ్చేసరికి చాలా మారుతుంది. పదో తరగతితో పోలిస్తే ఇంటర్ విద్యార్ధులలో మరికాస్త పరిపక్వత కనిపిస్తుంది.
ఆ సమయంలో వారు టీనేజ్ దశలో ఉంటారు కనుక వారి ఆలోచనా ధోరణి, ప్రవర్తలో అందుకు తగ్గట్లుగానే అనేక అనూహ్యమైన మార్పులు వస్తాయి. కనుక ప్రతీ విద్యార్ధి జీవితంలో కూడా ఇది ‘ఇంటర్ దశ’.. చాలా కీలకమైనది.
ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పాఠ్యాంశాలలో మార్పులు సంస్కరణలు చాలా అవసరమే. కానీ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు కూడా అంతే అవసరం.
కళ్ళెం లేని గుర్రాల్లా పరుగులు తీసే ఈ దశలో విద్యార్ధులకు పరీక్షల ఒత్తిడి అవసరమే. కానీ వారిపై ఒత్తిడి తగ్గించాలని పరీక్షలు నిర్వహించకపోతే, ‘చదవకపోయినా రెండో సంవత్సరంలోకి వెళ్ళిపోతాము కదా’ అనే ధీమా వారిలో ఏర్పడుతుంది. ఆ ధీమాతో చదువుపై శ్రద్ద తగ్గుతుంది.
ఈ దశలో విద్యార్ధులకు స్నేహితులు, క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలు, షికార్లు, ప్రేమలు వంటి అనేక వ్యాపకాలు, ఆకర్షణలున్నాయి. కనుక పరీక్షల భయం, ఒత్తిడి కూడా లేకపోతే కళ్ళెం లేని గుర్రాల్లా పరుగులు తీస్తారు.
కరోనా, లాక్ డౌన్ సమయంలో వరుసగా రెండు మూడేళ్ళు పరీక్షలు నిర్వహించలేకపోతే విద్యార్ధులు చదువులలో ఎంతగా వెనకబడిపోయారో వారికీ, ఉపాధ్యాయులకు, తల్లి తండ్రులకు, ప్రభుత్వాలకు కూడా తెలుసు. కనుక ఇప్పుడు సంస్కరణల పేరుతో ఇంటర్ ప్రధమ వార్షిక పరీక్షలు రద్దు చేయడం ఎంత మాత్రం మంచిది కాబోదు.
పరీక్షల రద్దు విషయంలో ఇంటర్ బోర్డు తప్పనిసరిగా తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభిప్రాయాలు తీసుకొని మరింత లోతుగా చర్చించడం మంచిది.