KCR - Jaganముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దమెందుకు? అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితి గురించి ప్రజలకే బాగా తెలుసు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీ కరెంటు కోతలతో అల్లాడిపోతుండేది. కానీ చంద్రబాబు నాయుడు ఆ సమస్యను కేవలం రెండు మూడు నెలలోనే పరిష్కరించారు.

ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఏపీలో ఎన్నడూ కరెంట్ కోతలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఎక్కడ చూసినా కరెంటు కోతలే. ‘జగనన్నకు చెపుదాం’ కార్యక్రమంలో అత్యధికంగా వచ్చిన పిర్యాదులు ఇవే. అయితే కరెంట్ కష్టాలకు 15 రోజులలో పరిష్కరిస్తామని సమాధానం చెపుతున్నారు. అంటే వర్షాలు పడితే విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది కనుక కరెంట్ కష్టాలు తీర్చేందుకు ఆ గడువు పెట్టుకొన్నట్లున్నారేమో?

Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?

ఏపీ దుస్థితి గురించి జేపీ నడ్డా, అమిత్‌ షాలు కూడా చెప్పేశారు. ఇప్పటి వరకు తెలంగాణ మంత్రులు మాత్రమే జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతుండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా ఏపీని చీకట్లు ముసురుకొన్నాయని అనేశారు.

సోమవారం గద్వాల జిల్లాలో జరిగిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, “తుంగభద్రానది ఇటువైపు మన తెలంగాణ రాష్ట్రం 24 గంటలు విద్యుత్‌ వెలుగులతో ధగధగా వెలిగిపోతుంటే, ఇక్కడి 20-30 కిమీ దూరంలో అవతలి ఒడ్డున గల ఏపీలోని కర్నూలులో, రాయలసీమ జిల్లాలలో అంతటా అంధకారం అలుముకొంది. నిత్యం కరెంట్ కోతలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు.

Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!

ఒకప్పుడు ఈ పాలమూరు జిల్లాలో ఉపాధి లేక మన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పొరుగునే ఉన్న ఏపీలోని రాయలసీమ జిల్లాలతో సహా అనేక రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్నారు. మన రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ఆ తుంగభద్రానది వంతెన దాటి ఓసారి కర్నూలులో తిరిగివస్తే మీకే అర్దమవుతుంది,” అని కేసీఆర్‌ అన్నారు.

ఈవిదంగా ఎవరో మనల్ని వేలెత్తి చూపారని బాధపడటం కంటే అందరూ మనల్ని వేలెత్తి చూపేలా ఎందుకు ఉండిపోయామని ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.

Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!

నిజానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అత్యంత దయనీయమైన పరిస్థితులున్నాయి. అటువంటి క్లిష్ట సమయంలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిన పెట్టి వడ్డించిన విస్తరిలా వైసీపీ ప్రభుత్వానికి అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో ముందుకు సాగి ఉండి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్‌ ఈ దుస్తితిలో ఉండేదే కాదు. టిడిపి కూడా వేలెత్తి చూపగలిగేది కాదు.

తనపై పగ, ద్వేషంతో రాష్ట్రానికి నష్టం కలిగించవద్దని చంద్రబాబు నాయుడు పదేపదే వేడుకొన్నారు కూడా. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ మాటను కూడా చెవికి ఎక్కించుకోలేదు.

అమరావతి వద్దనుకొన్నా పర్వాలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేయకపోయినా పర్వాలేదు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించి ఉండి ఉంటే బాగుండేది. కానీ సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన అన్ని రంగాలను పట్టించుకోకపోవడంతో ఈ దుస్తితి ఏర్పడింది.




అందుకే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఏపీని చూపిస్తూ దాని కంటే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది అంటూ గర్వంగా చెప్పుకొంటున్నాయి. ఇందుకు వారిని తిట్టుకోవడం అనవసరం. వేలెత్తి చూపుతున్నారని బాధ పడటం కూడా అనవసరం. అయితే ఇప్పటికే సమయం మించిపోయింది. కనుక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మేల్కొన్నా ప్రయోజనం లేదు. కనుక తాను పట్టిన మూడు కాళ్ళ కుందేలుతో ముందుకు సాగిపోవలసిందే. వైసీపీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజలు అందరూ మూల్యం చెల్లించాల్సిందే.