రాజకీయ ప్రయోగాలను ఆంధ్రప్రదేశ్‌ తట్టుకోగలదా?

TDP-JanaSena-YSRCP-BJPరాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దూసుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నేటికీ కోలుకోలేకపోగా నానాటికీ వెనకబడిపోతోంది. అందుకు పాలకుల తప్పు ఎంతుందో, ప్రజల తప్పు కూడా అంతే ఉందని చెప్పక తప్పదు.

తెలంగాణలో ప్రజలు టిఆర్ఎస్‌ పాలనలో అభివృద్ధిని చూసి మళ్ళీ టిఆర్ఎస్‌కే ప్రభుత్వ పగ్గాలు అప్పగించడం వలన నిలకడగా ఒకే విధానాలతో ముందుకు సాగిపోతోంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఉన్న ఏపీని చంద్రబాబు నాయుడు మళ్ళీ గాడిలో పెట్టి అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించినప్పటికీ, ప్రజలు వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రయోగం చేసుకొన్నారు. అది వికటించడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది. అయితే మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటివే మరిన్ని రాజకీయ ప్రయోగాలు చేసేందుకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి.

ADVERTISEMENT

బిజెపి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని దించుతుంటే, కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలని బరిలో దించుతోంది. సంక్షేమ పధకాలతో వైసీపీ నాలుగేళ్లుగా ప్రయోగాలు చేస్తూనే ఉంది. దాని దుష్పరిణామాలు ప్రజలందరూ అనుభవిస్తూనే ఉన్నారు. అయినా మళ్ళీ వైసీపీకే ఇంకో ఛాన్స్ తప్పనిసరి అని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాలను బ్రహ్మాస్త్రంగా టిడిపి మీద ప్రయోగించాలనుకొంటోంది కనుక టిడిపి కూడా ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో అదనంగా మరిన్ని సంక్షేమ పధకాలని ప్రకటించక తప్పలేదు. అయితే జగన్ ప్రభుత్వంలా అభివృద్ధిని విస్మరించమని, సంపద సృష్టించి దానితోనే సంక్షేమ పధకాలు అమలుచేస్తామని టిడిపి చెపుతుండటం ఊరట కలిగిస్తోంది.

ఈ సంక్షేమ పధకాల పోటీలో ఇంకా జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రవేశించలేదు. త్వరలోనే అవీ ప్రకటించడం ఖాయమే.

ఇక ఏపీలో ప్రజలు ఇప్పటికే టిడిపి, వైసీపీ, జనసేన పార్టీల మద్య చీలిపోయున్నారు. ఈసారి కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్ఎస్‌ పార్టీలు కూడా చక్రం తిప్పేందుకు సిద్దమవుతుండటంతో ఈ 6 పార్టీల మద్య ఓట్లు చీలిపోయి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది.

కనుక ఈసారి జరుగబోయే శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విజ్ఞతకు పరీక్ష అనే చెప్పాలి. వచ్చే ఎన్నికలలో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్య, విద్యుత్‌ రంగాల అభివృద్ధి వంటి ‘అభివృద్ధి అంశాలే’ ఎన్నికల అంశాలు కావాలి. వాటికి గ్యారెంటీ ఇచ్చే పార్టీనే ఎన్నుకోవడం చాలా అవసరం.

కాదని ఎప్పటిలాగే ఈ కుల, మతాలు, ప్రలోభాలు, సంక్షేమ పధకాలు, రాజకీయ ఒత్తిళ్ళు, ఎత్తుగడలు, రాజకీయ ప్రభావాలకు లొంగిపోయి ఎవరికి నచ్చిన్నట్లు వారు ఓట్లేస్తే తర్వాత మరో 5 ఏళ్ళపాటు ఇంతకంటే ఎక్కువే బాధలన్నీ అనుభవిస్తూ, ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మరిచిపోకూడదు.

ADVERTISEMENT
Latest Stories