ఏపీలో అర్దరాత్రి రోడ్లపై ప్రజలు ధర్నాలు… వైసీపీ గొప్పదనమేగా!

Andhra-Pradesh-Power-Cutsఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 97 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం చెప్పుకొంటారు.

ADVERTISEMENT

అయితే జీతాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీపీఎస్ పెన్షన్ విధానంపై ప్రభుత్వోద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ తదితర సిబ్బంది జీతాలు పెంచాలని ధర్నాలు చేస్తూనే ఉంటారు. కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తుంటారు. హైకోర్టులో కేసులు కూడా వేస్తున్నారు.

గుంతలు పడిన రోడ్లను మరమత్తులు చేయించాలని కోరుతూ ప్రజలు ఎమ్మెల్యేలకు, అధికారులకు వినతిపత్రాలు ఇస్తూనే ఉంటారు. తొమ్మిదేళ్ళ తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శమని వైసీపీ నేతలు నిసిగ్గుగా చెప్పుకొంటారు.

ఇప్పుడు ఈ జాబితాలోకి విద్యుత్‌ కోతలు కూడా చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో రాత్రిపూట విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. విద్యుత్‌ సరఫరా పునరుద్దరించాలని కోరుతూ అర్దరాత్రి రోడ్లపైకి ధర్నాలు చేస్తున్నారు.

సిఎం జగన్‌ సొంత జిల్లాలో సింహాద్రిపురం, కమలాపురం, పెద్దముడియం, కలశపాడు, కాశీనాయన, వీరపునాయునిపల్లి మండలాలో నిన్న రాత్రి అనేక గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు రోడ్లపైకి వచ్చి కూర్చోన్నారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని గణేకల్లు గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు అర్దరాత్రి విద్యుత్‌ సబ్ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు.

బాపట్ల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. చేరుకుపల్లి, రేపల్లె, కొల్లిపర, దుగ్గిరాల మండలాలో గ్రామస్తులు గురువారం అర్దరాత్రి కావూరు సబ్ స్టేషన్‌ వద్ద జాతీయ రహదారిపై బైటాయించి రాస్తారోకో చేసి నిరసనలు తెలియజేశారు. ఎన్టీఆర్‌, కోనసీమ జిల్లాలో ప్రజలు కూడా అర్దరాత్రి విద్యుత్‌ సబ్ స్టేషన్‌ ఎదుట ధర్నాలు చేశారు. జగ్గయ్యపేటలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రజలు నిరసనలు తెలియజేస్తూ రాస్తా రోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

విద్యుత్‌ సరఫరా చేయలేకపోయినప్పటికీ సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు అంటూ భారీగా విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో ఇదేవిదంగా విద్యుత్‌ కోతలు ఉండేవి. టిడిపి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు కేవలం 2-3 నెలల్లోనే విద్యుత్‌ కొరత సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత టిడిపి 5 ఏళ్ళ పాలనలో ఏనాడూ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలతో పాటు విద్యుత్‌ రంగం కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పడానికి అర్దరాత్రిపూట రోడ్లపై ప్రజలు చేస్తున్న ఈ ధర్నాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏపీలో ఈ పరిస్థితి చూసి ఇరుగుపొరుగు రాష్ట్రాలు నవ్వుకొంటున్నాయి… జాలిపడుతున్నాయి. అయినా ఏపీ నంబర్: 1 అని వైసీపీ నేతలు నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories