ఏపీలో వైసీపి ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించకపోవడం ఇప్పుడు పెద్ద వార్తేమీ కాదు. అలాగే కాంట్రాక్టర్లకు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడం వంటివన్నీ రోజువారీ వార్తలే కనుక వాటినీ ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం మానేశారు.
రాష్ట్రంలో గుంతల రోడ్ల గురించి ప్రతిపక్షాలు చెవిలో జోరీగలా సొద పెట్టడంతో, ఎలాగో ప్యాచ్ వర్కులు చేసి ‘మమ’ అనిపించేసింది జగన్ ప్రభుత్వం. అయినా రోజుకో కొత్త సమస్య పుట్టుకొస్తూనే ఉంది.
రాష్ట్రంలో 97 శాతం ప్రజలందరికీ ‘మేలు’ చేసేశామని జగన్మోహన్ రెడ్డి, వైసీపి మంత్రులు నేడు శాసనసభలో గొప్పగా చెప్పుకుంటున్న సమయంలోనే బయట సర్పంచ్‌లు శాసనసభ ముట్టడికి తరలివచ్చారు!
పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.691 కోట్లు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించి వాడేసుకుందని, ఆ నిధులనే తిరిగి పంచాయితీలకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
పంచాయితీ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవడం వలన గ్రామాలలో కనీస వసతులను కల్పించలేకపోతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు తిరిగి ఇస్తుందనే నమ్మకంతో చాలా మంది సర్పంచ్‌లు సొంత డబ్బు ఖర్చుచేసుకుని అప్పుల పాలవుతున్నారని ఆరోపించారు.
వాలంటీర్ల కంటే హీనంగా నెలకు కేవలం రూ.3,000 గౌరవ వేతనం ఇస్తుంటే, దాంతో తాము ఎలా బ్రతకగలమని సర్పంచ్‌లు అడుగుతున్నారు. కనీసం నెలకు రూ.15 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.
గ్రామ సచివాలయాలకు వచ్చే ఆదాయాన్ని పంచాయితీలకు బదిలీ చేయమని తాము కోరుతుంటే, సచివాలయాల నీళ్ళు, కరెంట్ బిల్లులు వగైరా ఖర్చులను పంచాయితీలే భరించాలనడం దారుణమని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇవే సమస్యలున్నాయి. వీటి గురించి సర్పంచ్‌లు చాలా కాలంగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు శాసనసభ ముట్టడికి రావలసి వచ్చింది.
పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవడం సిగ్గుచేటు. దాని కోసం సర్పంచ్‌లు శాసనసభను ముట్టడించి నిరసనలు తెలియజేసేందుకు రావడం ఇంకా సిగ్గుచేటు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుపడకుండా, సర్పంచ్‌లను ఎక్కడికక్కడ పోలీసులతో అడ్డగించి, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటం, పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేస్తుండటం ఇంకా దారుణం.
గ్రామస్థాయి నుంచి వైసీపి బలపడాలని గట్టిగా ప్రయత్నిస్తుంటుంది. కానీ గ్రామస్థాయిలో ఇటువంటి సమస్యలను పరిష్కరించాలనుకోకపోవడం అలసత్వమే కదా?
జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, కనుక తాము ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చెపుతున్నప్పుడే, ఇక్కడ అమరావతిలో సర్పంచ్‌లు శాసనసభను ముట్టడించడం యాదృచ్చికమే కావచ్చు. కానీ నిర్మలా సీతారామన్ చెపుతున్న మాటలు నిజమే అని స్పష్టమవుతోంది కదా?




