ఏపీకి సాయం చేసేశాం అనడంలో బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. ఏకంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ మూడున్నరేళ్ల కాలంలో దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రానికి చేయనంత సాయం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అంటున్నారు.
మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించినట్లు చెబుతోన్న నేతలు- ఆయా రాష్ట్రాలకు చెందిన వివరాలు, ఆధారాలు తనకు ఇస్తే తాను కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా పట్టుబడతానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఎప్పటిలానే కాకి లెక్కలు ఆయన చదువుకుంటూ పోయారు.
ఇలాంటి లెక్కలతో ప్రజలను వంచించాలని చూస్తే నష్టపోయేది వారే అని కాషాయ నేతలు గ్రహించినట్టు లేరు. నాలుగేళ్ల కాలంలో కనీసం రైల్వే జోన్ వంటి విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకోకుండా మాకు ఏపీ ప్రత్యేకం. ఏపీకి ఏదేదో చేసేశాం అని చెప్పి మభ్యపెట్టడం వారికే నష్టం చేస్తుందని గ్రహించకపోతే ఉన్న 5% ఓట్లు కూడా పోవడం ఖాయం.



