హైదరాబాద్‌లో ఈ-రేసింగ్… ఏపీలో ఊ-రేసింగ్!

Andhra-Pradesh-Teachers-No-Salaries-Hyderabad-FormulaE-Racesశనివారం మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ-రేసింగ్ జరుగుతోంది. ప్రపంచంలో పలు దేశాల నుంచి వచ్చిన రేసర్స్ ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి విదేశాలలో ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వాహకులతో, దేశంలోని ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ఈ ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించేందుకు ఒప్పించారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

నగరంలోని హుస్సేన్ సాగర్ (ట్యాంక్‌బండ్‌)ని ఆనుకొని 2.85 కిమీ పొడవుగల రేసింగ్ ట్రాక్‌లో 11 ఒకేసారి రేసింగ్ కార్లు 250-280 కిమీ వేగంతో దూసుకుపోతుంటే చూసి తీరాల్సిందే. ఈ ఫార్ములా ఈ-రేసింగ్‌ని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా వివిద రంగాలకి చెందిన ప్రముఖులు హైదరాబాద్‌ తరలివచ్చారు.

ADVERTISEMENT

ఈ ఒకే ఒక ఫార్ములా ఈ-రేసింగ్‌తో తెలంగాణ ప్రభుత్వం యావత్ దేశం హైదరాబాద్‌ వైపు చూసేలా చేసిందని చెప్పవచ్చు. ఫార్ములా ఈ-రేసింగ్‌ జరిగిందంటే ఆ నగరం అన్ని రంగాలలో ప్రపంచస్థాయి నగరాలతో సమానంగా అభివృద్ధిలో పోటీ పడుతోందని అర్దం. తెలంగాణ ప్రభుత్వ విదానాలు, హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందుతున్న తీరు చూసి ఇప్పటికే ఏటా వేలకోట్లు పెట్టుబడులు ప్రవాహంలా తెలంగాణకి వస్తున్నాయి. ఇప్పుడు ఫార్ములా ఈ-రేసింగ్ తర్వాత హైదరాబాద్‌ నగరానికి దేశవిదేశాల నుంచి మరిన్ని భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీలు, వాణిజ్య సంస్థలు తరలివస్తాయి.

తెలంగాణ ప్రభుత్వం రేసింగ్ వాహనాలతో పోటీ పడుతున్నట్లు 250-280 కిమీ వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా అంతే వేగంగా రివర్స్ గేరులో వెనక్కి దూసుకుపోతోంది. వేగంగా ముందుకు దూసుకుపోవడం గొప్పకాదు. శరవేగంగా వెనక్కి దూసుకుపోవడమే గొప్ప కదా?

అక్కడ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పులలో దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం కేవలం మూడేళ్లలో అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తిచేసి రాష్ట్రంలో దశాబ్ధాలుగా బీడుపడిన భూములకి నీరు పారించి, కేంద్ర ప్రభుత్వం కూడా కొనలేనంత ధాన్యం పండిస్తుంటే, ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలీదని చెప్పేశారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరం చుట్టూ చెట్లు, అడవులు పెంచుతూ పచ్చదనం పెంచుతుంటే, ఏపీ ప్రభుత్వం పచ్చటి ఋషికొండని తవ్వేసి గ్రీన్ మ్యాట్ వేసి పచ్చగా చూపిస్తోంది. తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి పెట్టుబడులు, పరిశ్రమల కోసం దావోస్ వెళ్ళి వస్తే ఏపీ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి మూడు రాజధానుల కోసం ప్రెస్‌మీట్‌లు పెట్టి గట్టిగా తన వాదనలు వినిపిస్తున్నారు.

చివరిగా తప్పక చెప్పుకోవలసిన మరో మాట ఏమిటంటే, అక్కడ హైదరాబాద్‌లో 285 కిమీ వేగంతో ఫార్ములా ఈ-రేసింగ్ జరుగుతుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయులు 10వ తారీకు వచ్చినా ప్రభుత్వం ఇంకా తమకి జీతాలు చెల్లించలేదంటూ బ్యానర్లు పట్టుకొని మరీ తిరుపతిలో రోడ్లపై నిరసన ర్యాలీలు చేస్తున్నారు. దీనినే ఊ-రేసింగ్ అని చెప్పుకోవాలేమో?

ADVERTISEMENT
Latest Stories