‘టామ్ అండ్ జెర్రీ’ రాజకీయాలు..!

TDP Janasena Congress BJP YSR Congress Parties

ఒకప్పుడు రాజకీయాలలో పార్టీల మధ్య సిద్ధాంత పరమైన విభేదాలు, వ్యక్తుల మధ్య నైతిక విలువలు కనిపించేవి. కానీ ఇప్పుడు రాజకీయాలలో పార్టీల మధ్య వ్యక్తిగత వైరాలు, వ్యక్తుల మధ్య రాజకీయ విధ్వేషాలు దర్శనమిస్తున్నాయి. అప్పుడు వాళ్ళు చేసారు..ఇప్పుడు మీరు చెయ్యాలి, ఇప్పుడు మీరు చేస్తున్నారుగా…రేపు మేం చేస్తాం…ఇలా రాజకీయ పార్టీల మధ్య ‘టామ్ అండ్ జెర్రీ’ రాజకీయాలు సాగుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీలు కూడా తమ పై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకు రేపు ప్రతి చర్య ఉంటుందని, అందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరిస్తున్నఅధికారులు, వారికీ మద్దతు పలుకుతున్న నాయకులు ప్రతిఫలం చెల్లించక తప్పదు అంటూ ఇప్పటి నుంచే అధికారపార్టీ నేతలకు, వారి కింద పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు పంపుతున్నారు ఆయా పార్టీల అధినేతలు.

ADVERTISEMENT

ఈ విషయంలో వైస్ జగన్ ఒక అడుగు ముందుకేసి తమ నేతల పై కేసులు పెట్టి, అరెస్టులు చేస్తున్న అధికారులను మేము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాలు దాటి వెళ్లినా సరే వారిని విడిచి పెట్టేదేలే అంటూ హుకుం జారీచేస్తున్నారు. ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ప్రజలు ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు…అనుభవించండి.

రేపు ఈ అవకాశం మాకు వస్తుంది అప్పుడు మెమెంటో మీకు ఇంకా బాగా తెలిసొచ్చేలా చేస్తాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తన పైన పెట్టిన ఈ ఫార్ములా కేసు గురించి ప్రస్తావించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ శ్రేణుల వాదన మరోలా ఉంది. గతంలో రేవంత్ రెడ్డిని అన్యాయంగా అర్ధరాత్రి అరెస్టు చేసినప్పుడు మీకు ఆ నొప్పి తెలియలేదా.? కనీసం తన కూతురు వివాహ మహోత్సవాన్ని కూడా మనస్ఫూర్తిగా చేసుకోలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు తెరాస ప్రభుత్వం చేసింది కక్ష్యా రాజకీయాలు కాదా? అంటూ కేటీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు రేవంత్ వర్గీయులు.

తెలంగాణ రాజకీయాలు ఇలా ఉంటే ఇక ఆంధ్రా రాజకీయాలు మరోలా సాగుతున్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం మెతక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని, గత ఐదేళ్ల వైసీపీ నేతల చర్యలకు కూటమి నుంచి ప్రతిచర్య రాకపోగా ఇంకా ఇప్పటికి వైసీపీనే బెదిరింపు ధోరణి కనపరుస్తుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి మద్దతుదారులు. గత ఐదేళ్ల వైసీపీ దురాగతాలకు నేడు కూటమి సమాధానం చెప్పి తీరాలంటూ పట్టుబడుతున్నారు బాబు, పవన్ ల శ్రేయోభిలాషులు.

బాబుని జగన్ అరెస్టు చేసారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా జగన్ ను, అందుకు కారణమైన అధికారులను అరెస్టు చేసి జైలుకు పంపితీరాలంటూ బాబు పై ఒత్తిడి చేస్తున్నారు టీడీపీ అభిమానులు. అలాగే పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఒక్కో వైసీపీ నేతను జైలుకు పంపాల్సిందే అంటూ వాదిస్తున్నారు జనసైనికులు.

ఇలా రెండు రాష్ట్రాలలో ఇప్పుడు పార్టీల మధ్య, ఆయా పార్టీల అభిమానుల మధ్య ‘టామ్ అండ్ జెర్రీ’ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఇందులో టామ్ మరియు జెర్రీ పాత్రలను ఎప్పటికప్పుడు సమయానుగుణంగా, సందర్భానుసారంగా మార్చుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు.

ADVERTISEMENT
Latest Stories