ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో “పోలవరం” ఒక ప్రధాన ఘట్టం అనే చెప్పాలి. అధికారంలో ఉన్న వారు పనులు పూర్తి చేయరు.., ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వాన్ని వదలరు. ఇలా ఏపీ రాజకీయాలలో పోలవరం పనులు నిరంతర ప్రక్రియ మాదిరి సాగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ పనులు పూర్తి కావడం లేదు. 2014 ఎన్నికల తరువాత కాస్త వేగం పెంచుకున్న ప్రాజెక్ట్ పనులు ప్రభుత్వాలు మారడంతో మళ్లి పడకేసింది.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు ఉపయోగపడే ఈప్రాజెక్టు..,ప్రజల అవసరాలకు ఉపయోగపడే రోజు కోసం కొన్ని తరాల నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచుస్తున్నారు. వారి నిరీక్షణలకు ఫలితం మాత్రం శూన్యం. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ తాము ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమిస్తానన్నారు.
మాట ఇచ్చినట్టే పోలవరం పనులు పూర్తి చేయలేదు కానీ…,’మంత్రుల పదవులు’ పూర్తి చేశారు. ఏపీ ‘నీటి’ పారుదల శాఖా మంత్రిగా కన్నా ‘నోటి’ పారుదల మంత్రిగానే పాపులర్ అయిన మంత్రి అనిల్ కుమార్ 2021-డిసెంబర్ నాటికి పోలవరం పనులు పూర్తిచేసి చూపిస్తాం అని అసెంబ్లీలో వీరంగాలు సృష్టించారు. మళ్లి అసెంబ్లీ సమావేశాల నాటికి పనులతో కాకుండా కారణాలతో ప్రజల ముందుకొచ్చారు.
రాష్ట్రంలో ఉన్న కోవిడ్ పరిస్థితులను కారణాలుగా చూపిస్తూ కాలం నెట్టికెళ్లే ప్రయత్నం చేశారు మంత్రి గారు. మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది, మాకు పనులు పూర్తి చేయాలన్న పట్టుదల ఉంది.,అధికారంలో ఉంది మా ప్రభుత్వమే., పోలవరం నిర్మించే ‘పవర్’ కూడా మాకే ఉంది అంటూ మీడియా ముందు ప్రగల్భాలు పలికిన నోటి పారుదల మంత్రికి జగన్ గారు ‘పవర్ హాలిడే’ ప్రకటించడంతో నిన్నటి దాకా ‘మంత్రులుగా’ ఉన్న వారంతా ఇప్పుడు ‘మాజీలుగా’ మారారు.
మంత్రి పదవి పాయే.., చేతిలో ఉన్న పవరు పాయే…, ఇక పోలవరం కూడా పాయేనా..?అంటూ సోషల్ మీడియాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ మీద ట్రోలింగ్ నడుపుతున్నారు నెటిజన్లు. ప్రాజెక్ట్ పూర్తి చేసే అధికారం చేతిలో ఉన్నప్పుడు ‘నోటి’కి పని చెప్పి ఇప్పుడు పవర్ పోయాక ‘కాలి’కి పని చెప్పి జారుకుంటే ఎట్లా..? మాజీగారు అంటూ టిడిపి శ్రేణులు అనిల్ కుమార్ కు చురకలు అంటిస్తున్నారు.



