ఏపీకి ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంతో సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపడితే చంద్రబాబు నాయుడు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. ఎందువల్లనంటే రెండు రాష్ట్రాలు ఉపయోగించుకున్నా కూడా ఇంకా వేల క్యూసెక్కుల నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి కనుక.
సిఎం చంద్రబాబు నాయుడు నేటికీ అదే మాటకి కట్టుబడి ఉన్నారు. కానీ నీళ్ళ రాజకీయాలు చేస్తూ సెంటిమెంట్ రగిలించి ప్రజలను తన వైపు తిప్పుకోవాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం, నిత్యం సిఎం చంద్రబాబు నాయుడు, నీళ్ళ దోపిడీ అంటూ వితండవాదం చేస్తూనే ఉంది. ఇన్ని రోజులుగా బనకచర్ల ప్రాజెక్టుపై అది చేసిన రాద్దాంతం వలననే ఆ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తిప్పి పంపిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ‘హంద్రీ-నీవా’ పేరుతో మళ్ళీ ఏడ్పులు మొదలుపెట్టింది. ఆ పార్టీ సొంత పత్రిక నమస్తే తెలంగాణ ఈరోజు ఆన్‌లైన్ సంచికలో “ఏపీ జల దోపిడీ!.. వచ్చినవి వచ్చినట్టు కృష్ణా నీళ్లు దిగువకు మళ్లింపు” అంటూ ప్రచురించిన వార్త ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కృష్ణా, గోదావరి వరద నీటిని నిలువచేసుకోలేక దిగువకు విడిచిపెట్టేస్తూ ఏపీని, సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటం ఆ పార్టీకి పరిపాటిగా మారింది.
వరద నీరు సముద్రంలో కలిసిపోయినా బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరం లేదు కానీ హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు తరలిస్తేనే చాలా అభ్యంతరమని అర్ధమవుతోంది.
అయితే వరద నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రాయలసీమకు నీళ్ళందిస్తునే ఉన్నారు. హంద్రీ-నీవా కాలువలో 1800 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహించేది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ కొట్కూరు వద్ద ఏర్పాటు చేసిన 7 పంపులను కమీషనింగ్ చేయించి వరద నీటిని తోడిపోసేందుకు సిద్దం చేసి ఉంచారు.
ఇప్పుడు కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తుండటంతో 7 పంపులను ఆన్ చేసి నీళ్ళు తోడిపోస్తున్నారు. దీంతో 2,532 క్యూసెక్కుల నీళ్ళు హంద్రీ-నీవా కాలువలో ప్రవహిస్తూ సీమ జిల్లాలవైపు బిరబిరా పరుగులు తీస్తున్నాయి.
ఈ పంప్ హౌసులో మొత్తం 12 పంపులున్నాయి. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఇంకా పెరిగితే మిగిలినవాటిని కూడా ఆన్ చేస్తే 3850 క్యూసెక్కుల నీళ్ళు సీమ జిల్లాలకు పారించవచ్చు. ఇప్పటికే జీడిపల్లి జలాశయానికి నీళ్ళు చేరుకున్నాయి. త్వరలో కుప్పం నియోజకవర్గానికి కూడా చేరుకుంటాయి.
ఇక్కడ ఏపీలో కృష్ణమ్మ నీళ్ళు సీమ ప్రజల దాహార్తి తీర్చేందుకు బిరబిర ప్రవహిస్తుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ, దాని సొంత పత్రిక తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతూనే ఉన్నాయి.




